వనపర్తి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారి సాక్షిగా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి స్పందించారు. పాద యాత్రల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దన్నారు. 2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నరేంద్రమోదీ స్వయంగా చెప్పింది నిజం కాదా ? దానిని తెలంగాణ ప్రభుత్వం సొంతంగా చేపట్టింది నిజం కాదా ? అని ప్రశ్నించారు.
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పావలా ఇయ్యనిది నిజం కాదా ? కనీసం ఈ ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నడైనా తెలంగాణ బీజేపీ నేతలు నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా ? అని వారిని సూటిగా ప్రశ్నించారు. ఇదే మీకు ఉమ్మడి పాలమూరు జిల్లా మీద ఉన్న ప్రేమనా ? నడిగడ్డకు, ఉమ్మడి పాలమూరుకు నష్టం కలిగించే కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఎందుకు ఇవ్వదు ? బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఎందుకు నోరు తెరిచి అడగరని సూటిగా ప్రశ్నించారు.
ఏడేళ్లుగా కృష్ణా నదిలో నీటి వాటాలు తేల్చకపోవడమే మీ గొప్పతనమా ? కృష్ణా నది వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు పేరుతో కుట్రలు చేస్తున్నది నిజం కాదా ? తెలంగాణ నీటి వనరులను గుప్పిట పట్టాలని భావిస్తున్నది నిజం కాదా ? తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజా కొనిపించే బాధ్యత నాది అని కిషన్ రెడ్డి చెప్పింది నిజం కాదా అని అన్నారు. వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం ? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది.. కొనిపించే బాధ్యత నాది. రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్ చెప్పింది నిజం కాదా ? ఆ తర్వాత రా రైస్ .. బాయిల్డ్ రైస్ పేరుతో రాజకీయం చేసింది నిజం కాదా ? ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ?
అని ఘాటుగా విమర్శించారు. దక్షిణ భారతదేశంలో 5వ శక్తిపీఠంగా ఉన్న అలంపూరు జోగులాంబ అమ్మవారి ఆలయ పరిసరాలు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏ అభివృద్ధి పనిని చేపట్టలేకపోతున్నది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకువచ్చి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను రూ.1200 కోట్లతో పునర్నిర్మించినట్లుగా కనీసం రూ.500 కోట్లు కేంద్రం ద్వారా తీసుకువచ్చి జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తాం అని వాగ్ధానం చేసే దమ్ముందా ?
అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా పాలమూరు, కందనూలు, గద్వాల ప్రాంత ప్రజల కల గద్వాల – మాచర్ల రైల్వే లైన్ ను దేశంలో అన్నిచోట్లా కేంద్రం నిర్మిస్తున్నట్లు .. ఇక్కడ కూడా నిర్మించేలా కేంద్రం నుంచి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తాం అని చెప్పే ధైర్యం ఉందా ? ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పాదయాత్ర చేయాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలతో కాలం వెళ్లదీసే తప్పుడు పనులు మానుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు.