ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 15 : బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ అదే పార్టీకి చెందిన గిరిజన నాయకుడిపై రుసరుసలాడారు. ప్రజాహిత యాత్రకు జనాన్ని ఎందుకు తీసుకురాలేదని బూతు పురాణం అందుకున్నారు. రెండు రోజుల క్రితం వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రకు జనాన్ని ఎందుకు తీసుకురాలేదని అభ్యంతరకర రీతిలో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ మాట్లాడారని ఆ పార్టీ నాయకుడు బోడావత్ రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం వీర్నపల్లిలో ప్రజాహిత యాత్ర చేపట్టిన సందర్భంగా సేవాలాల్, జగదాంబ ఆలయం కోసం బండి సంజయ్ కొంత నగదు ఇచ్చినట్టు గుండారానికి చెందిన రవీందర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీర్నపల్లితోపాటు పక్క మండలాలకు కూడా ఇస్తే బాగుంటుందని గురువారం ఆ పార్టీ నాయకురాలు రాణిరుద్రమను విన్నవించుకోగా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో పర్యటించినప్పుడు ఎందుకు రాలేద ని? ఉంటే ఉండండి, పోతే పోండి అంటూ (అభ్యంతరకర భాషలో) అవమానించారని రవీందర్ ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన జాతి కోసం విన్నవిస్తే ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడినట్టు విస్మయం వ్యక్తంచేశారు.