Etela Rajender | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం రాజా సింగ్, ఈటల రాజేందర్ మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవిని తామే దక్కించుకోవాలని ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్‌గా ఉండే వ్యక్తి కేటాయించాలని ఇటీవల రాజా సింగ్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఈటల రాజేందర్ స్పందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలని అంటున్నారని.. ఎలాంటి ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటరా.. రియల్ ఫైటరా? అని ప్రవ్నించారు. తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు పార్టీ అధ్యక్షుడిగా కావాలని తెలిపారు. అంతేతప్ప గల్లీలో కొట్లాడేవాళ్లు కాదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలో తెలియజేస్తూ రాజాసింగ్ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీనియర్లకే అధ్యక్ష పదవి ఇవ్వాలని రాజా సింగ్ ఆ వీడియోలో కోరారు. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ఈటల మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత నాయకుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు. పార్టీ అంటే కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కాదని తెలిపారు. కొత్త నాయకులు, కొత్త కార్యకర్తలు వస్తేనే పార్టీ గెలవగలుగుతుందని చెప్పారు.