Errabelli Pradeep Rao | కాశీబుగ్గ, జూలై 2 : ఎర్రబెల్లి ఇంట్లో పుట్టిన వారందరు ఎర్ర బల్లులు అని వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుపై బీజేపీ నేత, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మురళి మాటలను ఖండిస్తూ బుధవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖ కొత్తవాడకు చెందిన ఓ మహిళను గతంలో బూతులు తిట్టిన విషయం మరిచారా..? కొండా మురళి ఓ మైనార్టీ నాయకుని మతం పేరుతో అవమానకరంగా బూతులు తిడుతూ బెదిరించి కించపరిచిన విషయం మరిచారా..? మీలాగా ఎర్రబెల్లి కుటుంబ సభ్యులు ఎవరు వ్యక్తిగత విమర్శలు చేయరని బూతులు తిడుతూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం మా సంస్కృతి కాదు అన్నారు.
కొండ మురళికి పిచ్చి పట్టిందని ఆయనను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. రెడ్డి సామాజిక వర్గం సహకారంతో రాజకీయంగా ఎదిగి.. నేడు అదే రెడ్డి సామాజిక వర్గాన్ని బండబూతులు తిడుతున్నాడని మండిపడ్డారు. నాడు రాజశేఖర్ రెడ్డి సంకనాకి మంత్రి పదవి తెచ్చుకున్న విషయం మరిచారా? కెసిఆర్ కాళ్లు పట్టుకొని ఆనాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకున్నది నిజం కాదా..? నేడు రేవంత్ రెడ్డి భిక్ష తోటి మంత్రి పదవి తెచ్చుకున్నది నిజం కాదా? కొండా మురళి సమాధానం చెప్పాలని ప్రదీప్ రావు సవాల్ విసిరారు. తాను బీసీల పక్షపాతి అంటూ చేస్తున్న మాటలను ఖండించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కార్పొరేటర్ ను అక్రమంగా జైల్లో పెట్టించారని, ఇటీవల మరో బీసీ కార్పొరేటర్ పై మహిళతో తప్పుడు కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారని ప్రదీప్ రావు గుర్తు చేశారు.
బీసీలను హింసిస్తూ బీసీల కోసమే తాను పనిచేస్తున్నాను మురళి చెప్పడాన్ని జనం నమ్మడం లేదన్నారు. అటు సొంత పార్టీ నేతలను ఇటు వరంగల్ తూర్పు సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కొండా మురళి తీరును తప్పు పట్టారు. వరంగల్ తూర్పులో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న కొండా దంపతులు తూర్పులో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయక కేవలం విమర్శలు చేస్తూనే కాలం గడుపుతున్నారని ఆరోపించారు. వరంగల్ తూర్పు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని కొండా మురళికి ప్రదీప్ రావు ఛాలెంజ్ చేశారు. వరంగల్ ఓసిటిలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయానికి కొండా మురళి తరచు వస్తూ అధికారిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం జరుగుతున్న జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తికి యంత్రాంగం సహకరించడాన్ని తప్పు పట్టారు. కొండా మురళిని రాజకీయంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధమని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తేల్చి చెప్పారు.