అనగనగా జార్ఖండ్‌లో ఒక బొగ్గు గని తవ్వకం పని.. దాని కోసంప్రభుత్వం వారు ప్రైవేట్ కంపెనీల వాళ్లను టెండర్లకు పిలుస్తారు.. కంపెనీలు బిడ్లు వేస్తాయి.. గడువు ముగిశాక బిడ్లు ఓపెన్ చేస్తారు.. ఫలానా కంపెనీకి టెండర్ వచ్చిందనీ చెప్తారు. కానీ టెండర్ ఇవ్వరు..
ఏడాది నానుస్తారు. మళ్లీ కొత్త టెండర్ పిలుస్తారు.. మళ్లీ కంపెనీలు బిడ్లు వేస్తాయి.. ఏ పనికోసమైతే టెండర్ పిలిచారో.. ఆ పనుల్లో ఓనమాలు కూడా తెలియని ఓ కంపెనీ కూడా తగుదునమ్మా అని బిడ్ వేస్తుంది. ఉన్నట్టుండి నిబంధనలన్నీ మారిపోతాయి. సడలిపోతాయి. డిస్కౌంట్లు లభిస్తాయి. ఊహించినట్టుగానే తాము ఇవ్వాలనుకొన్న కంపెనీకి టెండర్ వస్తుంది.
పాపం ముందు టెండర్ దక్కించుకొన్న పెద్ద మనిషేమో.. కేంద్రంలో ప్రభుత్వం వారికి అన్నీనూ.. నా సంగతేందయ్యా అని అడిగితే.. ఆ కంపెనీకి అంత సీను లేదు.. ఎలాగూ ఫెయిలవుతుంది. తర్వాత నువ్వే కదా బొగ్గు ఇయ్యాల్సింది అని బుజ్జగిస్తారు.. సీన్ కట్‌చేస్తే.. ఈ టెండర్ దక్కించుకొన్న కంపెనీ ఓనరు కేంద్రంలోని ప్రభుత్వం వారి పార్టీలో చేరిపోతారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తాడు. నియోజక వర్గానికి ఉప ఎన్నిక వస్తుంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో సదరు పార్టీ రాజకీయ అస్థిరతకు పావులు కదుపుతుంది.
తొలి టెండర్ దక్కింది అదానీకి.. మలి టెండర్ తెచ్చుకొన్నది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఉప ఎన్నిక వచ్చింది మునుగోడుకు.. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు పావులు కదిపింది బీజేపీ..
బీజేపీ అధికార దాహానికి.. దమన నీతి తప్ప మరొకటి ఉండదని మోదీ షా ద్వయం పదే పదే నిరూపిస్తున్నది. తెలంగాణలో ఉప ఎన్నిక తెప్పించడం కోసం నష్టాల్లో విలవిల్లాడుతున్న ఎమ్మెల్యేను వెతికి వెతికి పట్టుకొని.. అతని కంపెనీకి అక్షరాలా 18 వేల కోట్లతో ఊపిరిపోసి మరీ పార్టీలో చేర్చుకొని.. రాజీనామా చేయించింది. తమను ఎదిరించి నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్కసుతో, తెలంగాణపై కక్షతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దేశ హితాన్ని.. జాతి ప్రయోజనాలను సైతం పణంగా పెట్టిన ఘనులు మోదీ, షా..
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ అలజడి సృష్టించడం.. సాఫీగా సాగుతున్న అభివృద్ధికి ఆటంకం కలిగించడం.. సాధారణ జనంపై హఠాత్తుగా ఉప ఎన్నిక రుద్దడం.. తెలంగాణపై ‘మోదీ-షా’ కుట్ర ఇది. ఇందుకోసం ఒకటీ.. అరా కాదు! ఏకంగా రూ.18,264 కోట్ల బొగ్గు మైనింగ్ కాంట్రాక్టును ఎరగా వేశారు. ఈ క్రమంలో తన ఆప్త మిత్రుడు అదానీని కూడా పక్కన బెట్టారు. అన్ని విషయాల్లో అదానీ కంపెనీకి అండగా ఉండే వీరు.. తెలంగాణ రాజకీయాల్లో చిచ్చు పెట్టేందుకు మాత్రం ఆ కంపెనీకి దక్కాల్సిన కాంట్రాక్టును రద్దు చేశారు. 2020లో పిలిచిన టెండర్లను రద్దు చేసి 2021లో మరోసారి టెండర్లు పిలిచారు.
టెండర్ షరతులు మార్చి.. నిబంధనలను ఏమార్చారు. మైనింగ్‌లో ఓనమాలు కూడా తెలియని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రాకు రూ.18,264 కోట్ల పనులను కట్టబెట్టారు. దానికి ప్రతిఫలంగానే మోదీ-షా ఆదేశాల మేరకు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని తెలుస్తున్నది. నిన్నటిదాకా కాల్వ పనులు, మట్టి పనులు చేసే కోమటిరెడ్డి కంపెనీ ఇంత పెద్ద బొగ్గు మైనింగ్ పనులు చేయగలదా? అంటే కచ్చితంగా చేయలేదనే పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ విషయం బీజేపీ పెద్దలకూ తెలుసు. బొగ్గు మైనింగ్ – సరఫరా చేతగాక సుశీ ఇన్ఫ్రా చేతులెత్తేస్తే.. ఎలాగూ అదానీ కంపెనీ నుంచి బొగ్గు దిగుమతి చేసుకోక తప్పదు. అంటే.. తెలంగాణలో అప్రజాస్వామికంగా రాజకీయాలు చేసేందుకు మోదీ-షా దేశ ప్రయోజనాలను సైతం పణంగా పెట్టారు. అర్ధంతరంగా మునుగోడుకు ఉప ఎన్నిక తెచ్చి తమాషా చూస్తున్నారు.
మొదట అదానీకే..
జార్ఖండ్ రాజధాని రాంచి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (సీసీఎఫ్ఎల్) ఉన్నది. దీనికి హజారీబాగ్, ఛత్రా జిల్లాల పరిధిలో చంద్రగుప్త ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ) అనే ప్రధాన బొగ్గు గని ఉన్నది. 3,331.5 ఎకరాల్లో విస్తరించిన గనులను ఎండీవో (మైన్ డెవలపర్ కమ్ ఆపరేటర్) పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలను సీసీఎఫ్ఎల్ ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు అయ్యే ఖర్చు రూ.3,437 కోట్లు. దీనికి సంబంధించి 25 ఏండ్లపాటు ఆపరేషన్ బాధ్యతలు ఇచ్చేందుకు 2020, జూన్ 30న గ్లోబల్ నోటీస్ ఇన్వైటింగ్ టెండర్లు పిలిచింది. అంటే చంద్రగుప్త ఓపెన్ కాస్ట్లో 25 సంవత్సరాలపాటు పనులు దక్కించుకొన్న కంపెనీ బొగ్గును వెలికితీసి, కోల్ ఇండియాకు సరఫరా చేయాల్సి ఉంటుంది.
2020, ఆగస్టు 31 వరకు బిడ్లను స్వీకరించారు. అదే ఏడాది సెప్టెంబర్ 2న బిడ్స్‌ను తెరుస్తామని కూడా నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. బిడ్లను పరిశీలించిన సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ టెండర్ కమిటీ, సాంకేతిక పరిశీలన (టెక్నికల్ బిడ్స్) పూర్తయిన తర్వాత మూడు కంపెనీలకు సంబంధించి ప్రైస్ బిడ్లు తెరిచేందుకు ఆమోదం తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మాంటెకార్లో, అరబిందో-మహాలక్ష్మీ ట్రైడెంట్ కన్సార్టియం ప్రైస్ బిడ్లను 2020, డిసెంబర్ 9న తెరిచారు. ఇందులో మాంటెకార్లో రూ.33,896.07 కోట్లు, అరబిందో-మహాలక్ష్మీ కన్సార్టియం రూ.29,553.03 కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ.26,329.68 కోట్లకు కోట్ చేశారు. ప్రైస్ బిడ్లలో తక్కువగా అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కోట్ చేసినందున ఆ కంపెనీని ఎల్-1గా నిర్ధారించారు. నిబంధనల ప్రకారం అదానీ కంపెనీకి పనులు దక్కినట్టు నిర్ధారించి, లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చి ఒప్ప ందం చేసుకోవాల్సి ఉంటుంది.
కాంట్రాక్టు వచ్చినట్టు ప్రకటించుకొన్న ఆదానీ కంపెనీ
చంద్రగుప్త ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు తమకే దక్కిందని అదానీ కంపెనీ పలు సందర్భాల్లో ప్రకటించుకొన్నది. ఈ విషయాన్ని స్టాక్ మార్కె ట్ విశ్లేషకులకు కూడా తెలిపింది. 2021 ఫిబ్రవరి మూడో తేదీన నిర్వహించిన అదానీ ఎంటర్ప్రైజెస్ అనలిస్టుల కాన్ఫరెన్స్‌లో నీరవ్ షా అనే అనలిస్ట్.. అదానీ ఎంటర్ప్రైజెస్ (మైనింగ్) సీఈవో వినయ్ ప్రకాశ్‌కు ఓ ప్రశ్న వేశారు. ‘చంద్రగుప్త ఓసీపీకి మన కంపెనీ వేసిన బిడ్డింగ్‌లో మనం ఎల్ వన్‌గా వచ్చామా? అదే నిజమైతే లెటర్ ఆఫ్ అవార్డు ఎప్పుడు వస్తుంది?’ అని అడిగారు. దీనికి వినయ్ ప్రకాశ్ జవాబిస్తూ.. చంద్రగుప్త ఓసీపీకి మనమే ఎల్ వన్‌గా వచ్చామని, త్వరలోనే కన్ఫర్మేషన్ వస్తుందని, దాని కోసమే వేచి చూస్తున్నామని తెలిపారు.
‘కోమటిరెడ్డి’ కోసం రెండోసారి టెండర్లు
2020లో నిర్వహించిన టెండర్ల ప్రకారం తమకే ప్రాజెక్టు పనులు దక్కాయని అదానీ కంపెనీ భావిస్తుండగా.. సరిగ్గా అవే పనులకు సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ 2021 ఫిబ్రవరి మూడో తేదీన అంటే, అదానీ కంపెనీ అనలిస్టులతో సదస్సు నిర్వహించిన రోజే బొగ్గుశాఖ మరోసారి టెండర్లు పి లిచింది. అదానీ కంపెనీకి ఆ పనులు ఇస్తూ ఒప్పందం జరగాల్సి ఉండగా.. తెలంగాణపై కన్నేసిన మోదీ-షా ద్వయం ఈ బొగ్గు మైనింగ్ కేంద్రంగా చక్రం తిప్పింది. అప్పటికే కోమటిరెడ్డి కంపెనీ సుశీ ఇన్ఫ్రా పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉండటంతో రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ బీజేపీ పెద్దలతో కలిసి మునుగోడు నియోజకవర్గ ప్రజలను సమిధలుగా మార్చేందుకు సిద్ధపడ్డారు. వారి నమ్మకాన్ని అమ్మకానికి పెట్టారు. రెండోసారి కూడా అదానీ కంపెనీ బిడ్లు వేసింది. కానీ.. సుశీ ఇన్ఫ్రాకు టెండర్లు దక్కేందుకు రెండో నోటిఫికేషన్లో నిబంధనలు మార్చి సులభతరం చేశారు.
రాజకీయ ఒప్పందం తర్వాతే …
రెండోసారి నోటిఫికేషన్ ప్రకారం 2021, ఫిబ్రవరి 24 నుంచి బిడ్డింగ్ డాక్యుమెంట్లను స్వీకరించారు. బిడ్స్ స్వీకరణకు చివరి తేదీ 2021 ఏప్రిల్ 14. బిడ్స్‌ను ఏప్రిల్ 16న తెరిచారు. అంతర్జాతీయ బిడ్స్ అనడంతో పెద్ద కంపెనీలు పోటీపడి ఉంటాయని అందరూ భావించారు. కానీ సుశీ ఇన్ఫ్రాలాంటి అతి చిన్న కంపెనీ కూడా అందులో ఉండటం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల పాటు టెండర్ ప్రక్రియ పురోగతి లేకుండానే ఆగిపోయింది. ఫిబ్రవరిలో టెండర్ నోటిఫికేషన్ వస్తే ఆగస్టులో టెండర్ ఖరారు చేశారు. ఈలోగానే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో మోదీ-షా ద్వయం పక్కా స్కెచ్ తయారు చేసి.. రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నట్టు భావిస్తున్నారు. ఆ తర్వాతే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి బీజేపీని పొగుడుతూ వచ్చారు. చివరకు బీజేపీ పెద్దల ఆదేశానుసారం రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చారని పరిశీలకులు అంటున్నారు. చివరకు మౌలిక వసతుల ప్రాజెక్టులను కవర్ చేసే ప్రముఖ వెబ్సైట్ ‘ప్రాజెక్టు టుడే’లో చంద్రగుప్త ఓసీపీ ప్రాజెక్టు కాంట్రాక్టును సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ – ఎంఆర్కేఆర్ కన్సార్టియం దక్కించుకొన్నదని 2021, ఆగస్టు 20న వెల్లడించారు. రెండోసారి కూడా అదానీ, మాంటెకార్లో వంటి పెద్ద మైనింగ్ కంపెనీలు బిడ్లు దాఖలు చేసినా.. మైనింగ్‌లో కించిత్తు అనుభవంలేని సుశీ కన్సార్టియంకు పనులు దక్కడం గమనార్హం. ఈ కన్సార్టియంలో సుశీ ఇన్ఫ్రాకు 74 శాతం వాటా ఉండగా.. ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్కు 24 శాతం వాటా ఇచ్చారు. ఈ ఎంఆర్కేఆర్ కంపెనీ ఏపీలోని రాజంపేట వైకాపా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులది కావటం విశేషం. ఈ కంపెనీ కూడా కాల్వలు, రిజర్వాయర్లు, బ్రిడ్జిలు, టన్నెల్స్ వంటి సివిల్ పనులు చేసినట్టుగానే ఉన్నది తప్పితే ఎక్కడా మైనింగ్ పనులు చేసిన అనుభవం లేదు.
సుశీకి మాత్రమే మినహాయింపు
రెండోసారి టెండర్లలో ఎల్1గా వచ్చిన సుశీ ఇన్ఫ్రాతో చర్చలు జరిపి, వారి అభిప్రాయం తీసుకొని టెండర్ ఖరారు చేశారు. ఈ చర్చల్లో సుశీ కోట్ చేసిన మొత్తం రూ.22 వేల కోట్లు. కానీ ఇందులో జీఎస్టీని మినహామించి, కోట్ చేసిన మొత్తాన్ని రూ.18,264,17,97,000గా ఖరారు చేశారు. మరి బిడ్డింగ్‌లో పాల్గొన్న ఏ ఇతర కంపెనీలకు కూడా ఈ అవకాశం ఎందుకు ఇవ్వలేదు? నిజంగా సుశీ కన్సార్టియంకు ఇచ్చినట్టుగానే వెసులుబాటు ఇస్తే ఆ కంపెనీలు కూడా తాము కోట్ చేసిన మొత్తాన్ని తగ్గించేవారేమో కదా? మైనింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న అదానీ, ఇతర కంపెనీలను కాదని కోమటిరెడ్డికి చర్చల ద్వారా ఎందుకు ఇచ్చారు? వాస్తవానికి అదానీ కంపెనీ దీనిపై న్యాయ పోరాటం చేస్తే పనులు దక్కుతాయనేది నిర్వివాదాంశం. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఎలాంటి అనుభవంలేని సుశీ ఇన్ఫ్రా కన్సార్టియం మైనింగ్‌లో విఫలమైతే, అటు తిరిగి ఇటు తిరిగి అదానీ కంపెనీ నుంచే దేశానికి అవసరమైన బొగ్గు కొనుగోలు జరుగుతుంది. అందువల్లే ఆ కంపెనీ మౌనం వహించినట్టు తెలుస్తున్నది.
తెలంగాణే టార్గెట్
ఈ మొత్తం వ్యవహారం తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించే లక్ష్యంతోనే సాగిందన్నది విస్పష్టం. కావాలని ఉప ఎన్నిక తేవడం ద్వారా రాష్ట్రంలో పరిపాలన కుంటుపడేలాచేయడం.. రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు ఉప ఎన్నికలో తలమునకలై ఉన్న సందర్భంలో ఆ పార్టీని చీల్చడానికి కుయుక్తులు పన్నడం మోదీ షా కూటనీతిలో భాగమన్నది ఈ వ్యవహారం.. ఆ తరువాత జరిగిన పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. అధికారం కోసం.. రాష్ర్టాల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో చక్కగా నడుస్తున్న ప్రభుత్వాలను పడగొట్టడం కోసం జాతి ప్రయోజనాలను సైతం పణంగా పెట్టడానికి బీజేపీ నేతలు మోదీ, షా వెనుకాడటం లేదనడానికి రాజగోపాల్ కంపెనీకి అడ్డగోలుగా టెండర్ కట్టబెట్టడమే ఉదాహరణ.
అర్హతలన్నీ బుట్టదాఖలు
ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్‌లో రోడ్లు, రైల్వేలు, యుటిలిటీ ప్రాజెక్టుల ద్వారా 79.29 శాతం ఆదాయం వస్తే, వాటర్ కనెక్షన్, ట్రీట్మెంట్ అండ్ సప్లయ్ విభాగాల నుంచి 19.82 శాతం ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. బొగ్గు, లిగ్నైట్ మైనింగ్ ద్వారా వచ్చిన ఆదాయం 0.88 శాతమేనని తెలిపారు. అంటే ఏమాత్రం మైనింగ్ అనుభవంలేని కంపెనీకి ఏకంగా రూ.18 వేల కోట్లకుపైగా విలువైన పనులు అప్పగించారన్నమాట.
కమిటీ గుట్టు రట్టు చేసినా ఆగని క్విడ్ ప్రో కో..
టెండర్లో పాల్గొనే సంస్థకు ఏడేండ్లకు మించి అనుభవంతోపాటు, 2,09,875 మిలియన్ క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిపిన రికార్డు ఉండాలని పేర్కొన్న సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీ. దీన్ని ఉల్లంఘించి సుశీ ఇన్ఫ్రాకే కట్టబెట్టారు.
2021 ఫిబ్రవరి 21న నిర్వహించిన అదానీ అనలిస్టుల కాన్ఫరెన్స్‌లో సంస్థకు చంద్రగుప్త ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కాంట్రాక్ట్ దక్కిందని స్పష్టంచేసిన అదానీ మైనింగ్ సర్వీసెస్ సీఈవో వినయ్‌ప్రకాశ్