కరీంనగర్ ప్రతినిధి/నల్లగొండ ప్రతినిధి, మార్చి 3 ( నమస్తే తెలంగాణ ) : కరీంనగర్, నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మల్క కొమురయ్య, పింగళి శ్రీపాల్‌రెడ్డి విజ యం సాధించారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే కొమురయ్య విజయం సాధించగా, ఎలిమినేషన్ ప్రక్రియతో శ్రీపాల్‌రెడ్డి గెలుపొందారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. కరీంనగర్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ బలపర్చిన మల్క కొమురయ్య తన సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగా మహేందర్‌రెడ్డిపై విజ యం సాధించారు. మొత్తం పోలైన 25,041 ఓట్లలో 897 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 24,144 ఓట్లకుగాను కొమురయ్యకు 12,959 ఓట్లు, మహేందర్‌రెడ్డికి 7,182 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆశోక్‌కుమార్‌కు 2,621 ఓట్లు వచ్చాయి.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ (టీఎస్) అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి తన సమీప యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై గెలుపొందారు. మొత్తం 19 మంది అభ్యర్థులకు గాను 24,135 ఓట్లు పోలయ్యాయి. 23,641 ఓట్లు చెల్లగా, 494 చెల్లలేదు. తొలిరౌండ్లో అత్యధికంగా శ్రీపాల్‌రెడ్డికి 6,035, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, హర్షవర్ధన్‌రెడ్డికి 4,437, పూల రవీందర్‌కు 3,115, సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజుకు 2,040 చొప్పున ఓట్లు వచ్చాయి. మిగతా 13 మందిలో 12 మందికి రెండంకెలు దాటలేదు. గెలుపు కోటాగా 11,821 ఓట్లను నిర్ధారించారు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా, శ్రీపాల్‌రెడ్డికి మొత్తం 13,969 ఓట్లు రావడంతో 2,148 ఓట్ల ఆధిక్యంతో గెలుపు వరించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లా ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్ర క్రియ ఇంకా కొనసాగుతున్నది. మొత్తం ఓట్లు 2,58,328 ఓట్లు పోలయ్యాయి.
ఎమ్మెల్సీ కోదండరాం నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చిన అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డికి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక్క ఓటు చొప్పున కూడా పడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదండరాం మద్దతు ఇచ్చి తనస్థాయిని తాను తగ్గించుకున్నారని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. మద్దతు ప్రకటించి పరువు పోగొట్టుకున్నారని కౌంటింగ్ సెంటర్లోనే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పరువునూ గంగలో కలిపారన్న మాటలూ వినిపించాయి. బీఆర్ఎస్ శ్రేణులూ సోషల్ మీడియా వేదికగా చురకలు వేస్తున్నాయి.