నల్లగొండ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇటుకలపాడు గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి భువనగిరి ఎంపీ హాజరయ్యారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీను పొగుడుతూ బీఆర్ఎస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే కిశోర్‌పై విమర్శలు చేశారు. గ్రామానికి వచ్చే రోడ్లను పట్టించుకోకపోవడంతో పూర్తిగా ధ్వంసమైందన్న కోమటిరెడ్డి.. తాను రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని గొప్పలు చెప్పబోయారు.
దాంతో గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు దేవుడి సన్నిధిలో ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోమటిరెడ్డి అనుచరులు, ఆ పార్టీ కార్యకర్తలు దాడికి యత్నించగా గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో గందరగోళం నెలకొన్నది. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇంతలోనే ఎంపీ వెంకట్‌రెడ్డి వెనుదిగడంతో వివాదం సద్దుమణిగింది.