హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి 24 గంటల్లోనే జారీ చేయనున్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గత నెల 23న ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం కావడంతో దీనినే కొనసాగించనున్నారు. ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన, రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదని మున్సిపల్‌శాఖ అధికారులు చెప్తున్నారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం, అవినీతి, నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్, ఇన్స్టాంట్ అప్రూవల్, ఇన్స్టాంట్ డౌన్లోడ్ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రిజిస్టరైన ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు ప్రత్యేకంగా యూజర్ ఐడీలు కేటాయించారు. ఆయా దవాఖానల్లో జన్మించిన శిశువులతో పాటు మరణించిన వారి పూర్తి వివరాలను యాజమాన్యాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దవాఖానల్లో కాకుండా ఇంటి వద్దనే సహజ మరణం పొందినవారి డెత్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు స్మశానవాటికల నిర్వాహకులకు కూడా యూజర్ ఐడీలు కేటాయించారు. దవాఖానలు లేదా స్మశాన వాటికల నిర్వాహకులు నమోదు ప్రక్రియను పూర్తి చేసిన తరువాత కుటుంబసభ్యుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్తో పాటు ఒక లింక్ వస్తుంది. దానిని క్లిక్ చేసి, సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానంలో ఇప్పటివరకు 2,768 జనన ధ్రువీకరణ పత్రాలు, 167 మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసినట్టు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ తెలిపారు.