హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలుగులో మాట్లాడి తెలుగు వాళ్లను మోసం చేయాలి.. అందుకు తెలుగువాళ్లయితేనే బెటర్.. అదీ ఉద్యోగం లేక పేదరికంలో ఉన్న యువకులే కావాలి.. సైబర్ దోపిడీకి బీహార్ ముఠాలు ఎంచుకొన్న కొత్త పంథా ఇది. ఆయుర్వేద మందుల అమ్మకానికి మార్కెటింగ్ చేయాలని పిలిపించి, సైబర్ నేరాల్లో తర్ఫీదునిచ్చి, 15 శాతం కమీషన్ ఆశ చూపి.. భారీ ఎత్తున మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. కొన్ని రోజుల కింద అందిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఈ గుట్టు బట్టబయలైంది.
ఈ సమాచారం అందుకొన్న పోలీసులు బీహార్‌కు రైలులో బయలుదేరిన 40 మంది మహబూబ్‌నగర్ జిల్లా యువకులను కాపాడారు. వివరాల్లోకెళితే.. మహబూబ్‌నగర్ చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు కొన్ని రోజులుగా ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారు. వారు భారీగా సంపాదిస్తున్నట్టు ప్రచారం జరగటంతో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను కూడా పంపిస్తున్నారు. అయితే, కొన్ని రోజుల కిందట సైబరాబాద్ పోలీసులకు నాప్టాల్, స్నాప్‌డీల్ కొనుగోళ్లపై బహుమతులంటూ, తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని ఫోన్లు చేసి తెలుగులో మాట్లాడి బురిడీ కొట్టించిన ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో ఏపీ పోలీసులు కూడా ఈ గ్రామాలకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మార్కెటింగ్ అంటూ యువతకు గాలం
బీహార్ ముఠాలు ఆయుర్వేద మందుల మార్కెటింగ్, ఆన్లైన్ విక్రయం అంటూ యువకులకు ఎర వేసి, బీహార్‌కు తీసుకెళ్లి అక్కడ ఓ గదిలో 3 రోజుల పాటు నిర్బంధిస్తున్నారు. ఆ తర్వాత వారికి సైబర్ నేరం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. అనంతరం కొన్ని ఫోన్ నంబర్లను ఇచ్చి, ఫోన్ చేసి బురిడి కొట్టించాలని ఆదేశిస్తున్నారు. కమీషన్ వస్తుండటంతో ఆ యువకులు సైబర్ నేరాలకు అలవాటు పడుతున్నారు. ఆ యువకులు ఇంకొంత మందిని తీసుకెళ్తున్నారు. యువకులను ఇక్కడి నుంచి బీహార్‌కు రైళ్లలో పంపేందుకు ఇక్కడ ఒక ఏజెంట్ కూడా ఉంటాడు. ఆ ఏజెంట్‌కు ఒక్కో యువకుడు చేసే మోసాలపై 12 శాతం కమీషన్ వస్తుంది.
ఇలా భారీ స్థాయి మానవ అక్రమ రవాణాకు బీహార్ ముఠాలు పాల్పడుతున్నట్టు తేలింది. మరింత మంది ఆ ఊబిలో చిక్కకుండా సైబరాబాద్ పోలీసులు, మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు, ప్రభుత్వ అధికారులతో కలిసి యువతకు సైబర్ నేరాలు, శిక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. అటు.. బీహార్ ముఠా ప్రధాన సూత్రధారి, ఏజెంట్లను పట్టుకోవటానికి దర్యాప్తును వేగవంతం చేశారు.