కొత్తూరు, ఆగస్టు 31: ‘నేను సీఎం తమ్ముడి మనిషిని. నా వర్గం వారికి నెలకు రూ.5 లక్షలు ఇవ్వాలి. లేకుంటే జేపీ దర్గా నిర్వహణ కాంట్రాక్ట్‌ను రద్దు చేయిస్తా’ అంటూ బిగ్ టీవీ రిపోర్టర్ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా నిర్వాహకులు వాపోయారు. తనకు డబ్బులివ్వలేదని శుక్రవారం రాత్రి తమపై దాడి చేశాడని బాధితులు కొత్తూరు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఈ మేరకు కొత్తూరు సీఐ నరసింహారావు వివరాలు వెల్లడించారు. జేపీ దర్గాలో నిర్వహణ కాంట్రాక్ట్ దక్కించుకన్న ఖాజా పాషా వద్ద.. సయ్యద్ రఫీక్‌కు చెందిన 9 మంది సబ్ కాంట్రాక్టర్లు నిర్వహణ పనులు చేస్తున్నారు. బిగ్ టీవీ రిపోర్టర్ ఫయాజ్ మునావర్ తన వర్గం వారికి నెలకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే నిర్వహణ పనులు చేసుకోనివ్వనని బెదిరిస్తూ కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి బొమ్మల దుకాణం వద్ద ఫయాజ్ వర్గం వారు కట్టెలు, హోటల్లోని గరిటెలతో రఫీక్ వర్గీయులపై దాడి చేశారు. ఈ దాడిలో రఫీక్ వర్గీయులు గాయపడ్డారు. రఫీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే.. ఫయాజ్ మామ నౌకత్, నవాజ్ తదితరులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కాగా.. బిగ్ టీవీ రిపోర్టర్ ఫయాజ్ మునావర్ సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డి మనిషినంటూ దర్గాలో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని బాధితుడు రఫీక్ మీడియా ముందు వాపోయాడు. కొత్తూరు పోలీస్ స్టేషన్ మొత్తం తమ కంట్రోల్లో ఉందని, ఫిర్యాదు చేసినా తమను ఎవరూ ఏం చేయలేరని, డబ్బులు ఇవ్వాల్సిందేనని ఫయాజ్ బెదిరిస్తున్నాడని చెప్పారు. ఫయాజ్‌పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రపీక్ మీడియా ముందు విలపించాడు.