కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ విషయంలో విజిలెన్స్ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టంగా ఉన్నదంటూ వచ్చిన వార్తలు నిజమేనని నిగ్గుతేలుతున్నది. తుది నివేదికలో నుంచి చివరి క్షణంలో నలుగురు అధికారుల పేర్లను తొలగించడం వెనుక.. వారితో భారీ డీల్ కుదుర్చుకోవడమే కారణమని తెలుస్తున్నది. కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై.. ప్రస్తుతం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య తీవ్ర చర్చ సాగుతున్నది.
నలుగురు అధికారులను తప్పించిన వైనం వెనుక విజిలెన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఓ అధికారి కీలక పాత్ర పోషించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే అక్రమాలకు, అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టుగా కనపడుతున్న ఈ నివేదికనే ఘోష్ కమిషన్ ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. మరి విజిలెన్స్ నివేదికే తప్పుడు పద్ధతిలో ఉంటే.. దాన్ని ఆధారం చేసుకుని అల్లిన ఘోష్ కమిషన్ నివేదిక ప్రామాణికత ఎంత?
కరీంనగర్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసలు మేడిగడ్డ బరాజ్ విషయంలో విజిలెన్స్ చేసిన విచారణలో ఏ నలుగురు అధికారులను తప్పించారు..? వారి పేర్లు ఎందుకు విచారణ నివేదికలో చేర్చబడలేదు..? సదరు అధికారుల కన్నా తక్కువ బిల్లులు రికార్డు చేసిన వారిపై ఎలా కేసులు పెట్టారు..? ఆ నలుగురు అధికారులను తప్పించడం వెనుక జరిగిన తతంగం ఏమిటి? దీనికి వెనుక కుదిరిన డీల్ ఎంత? ఇందులో కీలక సూత్రధారిగా వ్యవహరించిన అధికారి ఎవరు? నీటి పారుదల శాఖలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. విజిలెన్స్ తుది నివేదికలో కొందరిని తప్పించడం వెనుక భారీ ఒప్పందం జరిగిందని ప్రచారమవుతున్నది. మేడిగడ్డ బరాజ్ వద్ద కొన్ని పిల్లర్స్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో.. ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపాలున్నట్లుగా ప్రచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. సదరు విజిలెన్స్ అధికారులు.. జనవరి 2024 లోనే జల సౌధతో పాటుగా.. సంబంధిత ఇంజినీరింగ్ కార్యాలయాల్లో సోదాలు చేసింది. ఆమేరకు.. అంచనాలు, డిజైన్లు, నిర్మాణంకు సంబంధిచి ఇచ్చిన ఆదేశాలు, వ్యయం, డీపీఆర్ వంటి అనేక రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. విజిలెన్స్ నివేదిక అధారంగా మేడిగడ్డ బ్యారేజ్ తోపాటుగా.. ఇఎన్సీ జనరల్ ఇన్ఎన్సీ ఓఅండ్ఎం, క్వాలిటీ కంట్రోల్, డిజైన్, మాడల్ స్టడీస్, తదితర విభాగాల్లో పనిచేసిన.. మొత్తం 57 మంది అధికారులపై వివిధ రకాల కేసులతో పాటుగా చర్యలు చేపట్టింది. ఇందులో 17 మంది అధికారులపై క్రిమినల్ కేసులు, మరో 33 మంది అధికారులకు మేజర్, కామన్ ఫెనాల్టీలు,అలాగే మరో 7 గురు అధికారులపై (సెక్షన్లు మార్చి) మేజర్, కామన్ ఫెనాల్టీలు విధించారు.
నలుగురిని తప్పించిన ఓ కీలక అధికారి
విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పదే పదే చెపుతోంది. జస్టిష్ ఘోష్ కమిషన్ కూడా విజిలెన్స్ నివేదికను ప్రధాన ప్రామాణికంగా తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారాన్ని నిశితంగా పరిశీలిస్తే.. విజిలెన్స్ అధికారులు ఇచ్చి నివేదికపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంకు సంబంధించి ఆరంభం నుంచి విజిలెన్స్ కమీషన్ విచారణ తేదీ వరకు 25 మంది అధికారులు వివిధ హోదాల్లో పని చేశారు. ఇందులో 21 మందిపై కేసులు నమోదు కాగా.. నలుగురు అధికారుల పేర్లను మాత్రం విజిలెన్స్ విభాగం తన నివేదికలో మినహాయించినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. పస్తుతం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నివేదికలోనూ వారి పేర్లు లేవు. ఇందులో అత్యధిక బిల్లులు రికార్డు చేసిన అధికారులున్నారు. వారికంటే..తక్కువ బిల్లులు రికార్డు చేసిన అధికారులపై చర్యలకు నివేదిక ఇచ్చిన విజిలెన్స్ ఆ ఆధికారులు ఆ నలుగురికి మాత్రం మినహాయింపు వెనుక పెద్ద తంతంగమే నడిచినట్లుగా తెలుస్తోంది.
డీల్ కుదరడం వల్లే.. ?
నిజానికి ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న వారిని చూస్తే.. విజిలెన్స్ తప్పించిన పలువురి అధికారుల కన్నా తక్కువ బిల్లులు రికార్డు చేసిన వారున్నారు. అయినా వారిపై కేసులు నమోదు అయ్యాయి. డీఈఈగా పనిచేసిన వీ సూర్యప్రకాశ్ ఆయన బ్యారేజ్ సబ్ డివిజన్లో ఆయన కంటే ముందుగా పనిచేసిన డీఇ నంద, అలాగే ఆయన తదుపరి పని చేసిన ఎల్. భీంరాజ్లపై విజిలెన్స్ కేసులు పెట్టింది. నిజానికి నంద రూ.46 కోట్లు మాత్రమే బిల్ రికార్డు చేసినట్లుగా రికార్డులు చెపుతున్నాయి. కాని వి.సూర్యప్రకాశ్ మాత్రం రూ.221 కోట్ల బిల్లులు రికార్డుచేసినట్లుగా.. తాజా అధారాలు చెపుతున్నాయి. ఇక్కడ రూ.221 కోట్లు రికార్డు చేసిన వి.సూర్యప్రకాశ్ (డీఇఇ)ని వదిలిపెట్టి.. నందతో పాటుగా మిగిలిన వారిపై కేసులు పెట్టడంపై అనుమానాలకు తావిచ్చింది. అలాగే మరో డీఇఇ వి.ప్రకాశ్ దాదాపు రూ.26 కోట్ల మేకు బిల్లులు రికార్డు చేశారు. ఇతని కన్నా.. తక్కువ రికార్డు చేసిన వారిపై విజిలెన్స్ కేసులు నమోదుచేసింది. అలాంటప్పుడు.. వి.ప్రకాశ్‌ను ఎందుకు తప్పించారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే కోవలో ఎఇఇ పవనకుమార్కూడ ఉన్నారు. ఎస్ఇగా పనిచేసిన ఎం కరుణాకర్ అపరేషన్ మెయింటెన్స్‌లో కీలకలంగా వ్యవహారించారు.
మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న.. ఇతనిపై మాత్రం కేసులు పెట్టకుండా తప్పించారు. దీనికి వెనుక పెద్ద తంతంగం నడిచినట్లుగా ప్రస్తుతం.. ఇంజినీరింగ్ విభాగంలో చర్చ జరుగుతుంది. విజిలెన్స్ ఇంజినీరింగ్ విభాగంలోని ఓ అధికారి… పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకొని.. కొంత మంది అధికారులను విజిలెన్స్ నివేదిక నుంచి తప్పించారన్న చర్చ ప్రస్తుతం ఆ శాఖలో సాగుతుంది. ఇది ఇలా ఉంటే.. విజిలెన్స్ నివేదిక లోపభూయిష్టంగా ఉందని ముందు నుంచి వస్తున్న విమర్శలకు.. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. అంటే.. విజిలెన్స్ విచారణ అనేది నిష్పపక్షపాతంగా జరగలేదని స్పష్టం అవుతుంది. కాగా.. ఈ నివేదికను జస్టిష్ ఘోష్ కమీషన్ ప్రధాన ప్రామాణికంగా తీసుకుందన్న వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఘోష్ కమిషన్‌ను కూడా విజిలెన్స్ పక్కదారి పట్టించినట్లే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజానిజాలు తేలాలంటే… ముందుగా ఈ నలుగురి అధికారుల విషయంలో విజిలెన్స్ అధికారుల వైఖరి ఏమిటన్నది ముందుగా తేలాల్సిన అవసరం ఉంది. అయితే.. ఈ కథనం మొత్తంలో అధికారులు టార్గెట్ కాదన్నది వాస్తవం. విజిలెన్స్ తప్పుడు రిపోర్టు ఇచ్చిందన్న విషయం వెలుగులోకి తేవడానికి అధికారుల విషయంలో జరిగిన వ్యవహారాన్ని తెరపైకి తేక తప్పడం లేదు.
21 మందిపై వివిధ రకాల కేసులు
తప్పించిన నలుగురి అధికారులను విషయానికి వస్తే.. అపరేషన్ అండ్ మెయింటెన్స్ (ఓఅండ్ఎం)విభాగంలో (25-5-2022 నుంచి 30-9-2024 వరకు పని చేశారు) సూపరిటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఇ)గా పనిచేసిన ఎం. కరుణాకర్‌ను విజిలెన్స్ తప్పించింది. అలాగే.. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఇఇ)గా(7-9-2017నుంచి 2-4-2021 పనిచేశారు) పనిచేసిన వి.సూర్యప్రకాశ్, మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఇఇ)(21-01-2018 నుంచి 31-01-2018)గా పని చేసిన వి. ప్రకాశ్‌ను, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎఇఇ) గా (25-5-2022 నుంచి 30-09-2024) పనిచేసిన జి.పవన్కుమార్లున్నారు. మొత్తం 25 మంది అధికారులు ఈ బ్యారేజ్ నిర్మాణంలో పనిచేస్తే.. అందులో 21 మందిపై వివిధ రకాల కేసులు నమోదు చేసిన విజిలెన్స్ ఈ నలుగురు అధికారులను మాత్రం ఎందుకు మినహాయించిందన్న దానిపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.