కృష్ణ కాలనీ, ఫిబ్రవరి 23 : భూ తగాదాల తోనే నాగవెల్లి రాజలింగమూర్తిని హత్యచేశా రని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఘటన వివరాలను ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనలో 10 మందిపై కేసులు నమోదు చేశామని, వీరిలో ఏ1 రేణికుంట్ల సంజీవ్, ఏ2 పింగిలి సేమంత్, ఏ3 మోరె కుమార్, ఏ4 కొత్తూరి కిరణ్, ఏ5 రేణికుంట్ల కొమరయ్య, ఏ6 దాసారపు కృష్ణ, ఏ7 రేణికుంట్ల సాంబయ్యను అరెస్టు చేశామని వివరించారు. ఏ 8 కొత్త హరిబాబు, ఏ9 పుల్ల నరేశ్, ఏ10 పుల్ల సురేశ్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఘటనకు సంబంధించి ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజలింగమూర్తి, నిందితులకు భూపాలపల్లిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో తగాదా నడుస్తున్నది. ఇరువర్గాల వారు కోర్టుకు కూడా వెళ్లారు. తన కుటుంబ సభ్యుల నుంచి ఎకరం భూమిలో కొంత భాగాన్ని రాజలింగమూర్తి మోసపూరితంగా రాయించుకున్నాడని నిందితుల్లో ఏ1గా ఉన్న రేణికుంట్ల సంజీవ్ కక్ష పెంచుకున్నాడు.
రాజలింగమూర్తిని చంపితేనే తమ భూమి తమకు దక్కుతుందని అనేకసార్లు తన కుటుంబసభ్యులతో సంజీవ్ చెప్పాడు. ఇందుకోసం బంధువులను కూడా సహాయం చేయాలని కోరాడు. భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబుకు తెలపగా ఆయన సైతం సరేనన్నాడు. ఈ నెల 19న సంజీవ్ కోర్టు పేషీకి వెళ్లగా అకడ రాజలింగమూర్తి కనిపించాడు. ఎలాగైనా రాజలింగమూర్తిని చంపేయాలని భావించి సంజీవ్, కృష్ణ, నరేశ్, కిరణ్, కుమార్, బబ్లూ కలిసి పథకం వేశారు. సంజీవ్ ఇంటి వద్ద దాచిన కత్తులు, రాడ్డు తీసుకొని రాజలింగమూర్తి ఇంటి సమీపంలో కాపుకాశారు. అదేరోజు సాయంత్రం 6:45 గంటలకు రాజలింగమూర్తి తన ఇంటి సమీపంలోకి రాగానే కత్తులు, రాడ్డుతో దాడి చేసి బైక్‌లపై పారిపోయారు. తీవ్రగాయాలతో రాజలింగమూర్తి అకడికకడే చనిపోయాడు. నిందితులు శనివారం సాయంత్రం 6:30 గంటలకు కేటీకే-5 ఇంకె్లైన్ చెక్ పోస్ట్ సమీపంలో కలిసి పారిపోవాలని మాట్లాడుకుంటుండగా భూపాలపల్లి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు.