భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో చెంచు గిరిజనుల అభివృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ), అనంతపూర్‌కు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆదిమ గిరిజన సమూహాలలో (పీజీటీ) ఒకటైన చెంచుల అభివృద్ధి కోసం ఆర్డీటీ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లోని చెంచు గిరిజనుల కోసం వారి జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టులో భాగంగా 520 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. ఎక్కువ మంది చెంచులు ఇప్పటికీ ఎలుకలు, పిల్లులు, కుక్కలు, ఉడుతల వేటపైనే జీవిస్తున్నారన్నారు. నాగరికతకు దూరంగా ఇంకా పేదరికంలోనే జీవితాలు గడుపుతున్నట్లు తెలిపారు.
ఆర్డీటీ ప్రాంతీయ డైరెక్టర్ షణ్ముఖ రావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం భూపాలపల్లిలోని కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసింది. 96 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది, 102 ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. చిత్యల్ మండలంలోని శాంతి నగర్ గ్రామంలో 14 ఇళ్లతో పాటు మరో ఆరు ఇళ్లకు భూమి కేటాయించాలని బృందం కలెక్టర్‌ను కోరింది. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ చిత్యాల తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి శాంతినగర్‌లో ఆరు ఇళ్ల నిర్మాణానికి వెంటనే భూమిని కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా ఘన్పూర్, గాంధీనగర్, రవీనగర్, కొండంపల్లి, గొల్లపల్లి, పాపయ్యపల్లి గ్రామాలలో గృహాల నిర్మాణానికి ఆర్డీటీకి పూర్తి సహకారాన్ని అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యుత్, నీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ఘన్పూర్ మండల కేంద్రంలో ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసును ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.
చెంచులు, యనాడిలు కొనుగోలు చేసిన భూములలో ఇళ్ళు నిర్మించడానికి, అనుమతి ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా గోవిందరాపేట మండలానికి చెందిన తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఘన్పూర్ తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఆర్డిటి ఏరియా టీమ్ లీడర్ సుబ్బారావు, సమన్వయకర్తలు మారుతి, హనుమంతు, ఘన్పూర్ ఆర్ఐ సాంబయ్య, డీపిఆర్ఓ రవి కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.