తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలతో కన్ను మలిగేంత సేపు కూడా కరెంట్ కోతలు విధించలేదు. 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు రాష్ట్రమంతటా నాడు సరఫరా అయింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పాతరోజులు మళ్లీ దాపురించాయి. అప్రకటిత విద్యుత్తు కోతలతో రాష్ట్రమంతటా అన్ని రంగాలు అతలాకుతలం అవుతున్నాయి. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్ల రాజ్యం రాబోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికంతటికీ కాంగ్రెస్ పాలకుల అసమర్థతే కారణమని రాష్ట్ర ప్రజానీకం దుమ్మెత్తి పోస్తున్నది.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘కరెంట్ కష్టాలు తప్పవు.. విద్యుత్తును పొదుపుగా వాడండి’ అని నీతి వాక్యాలు వల్లెవేస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం, స్వయానా విద్యుత్తుశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న భట్టి విక్రమార్క ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం ఉన్నదన్న సమాచారం నెలలుగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలేవీ తీసుకోలేదని ఆయన వ్యాఖ్యలను బట్టే తెలుస్తున్నది. జలాశయాల్లో నీళ్లు లేవని, థర్మల్ విద్యుత్తే ప్రత్యామ్నాయం అంటున్న ఆయన ఆ మేరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. విపత్తు ఎదురవుతున్నదనే విషయం తెలిసి కూడా సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారని, తీరా వర్షాకాలంలోనూ కరెంట్ కోతలేంది? అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు.
అప్రకటిత విద్యుత్తు కోతలు
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. రైతుల నుంచి పరిశ్రమల వరకు.. వ్యాపారుల నుంచి విద్యార్థుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. కోతలను భరించలేక జనం, రైతులు ఇటీవల వివిధ జిల్లాల్లోని పలు సబ్స్టేషన్ల ఎదుట నిరసనలకు దిగిన సందర్భాలు చోటుచేసుకొన్నాయి.
చేతులెత్తేసిన సర్కార్
కరెంటు సరఫరా విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసిందని.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్నదని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. అప్రకటిత కోతలతో వ్యవసాయం, పరిశ్రమలు, చిరు వ్యాపారులు, విద్యా సంస్థలు, గృహ వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యేకించి వ్యవసాయానికి గండం పొంచి ఉన్నది. సాగు పనులు ఊపందుకుంటున్న ఈ తరుణంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతుల్లో కలవరం మొదలైంది.
నిలిచిన హై‘డల్’ విద్యుదుత్పత్తి
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లు ఖాళీ అయ్యా యి. జలవిద్యుత్తు కేంద్రాలు నడిచే పరిస్థితి కనిపించడమే లేదు. జలాశయాల్లో హైడల్ విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో టీజీ జెన్కో హైడల్ ప్లాంట్ల సామర్థ్యం 2,441.8 మెగావాట్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్ని ప్లాంట్లల్లో 76.45, మేలో 78.70 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. జూన్‌లో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్తు 64.91 మిలియన్ యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం.
కొందామన్నా దొరికేనా?
దేశంలో విద్యుత్తును కొందామన్నా దొరుకడంలేదు. భవిష్యత్తులో కొందామన్నా విద్యుత్తు దొరికే పరిస్థితులు కనిపించడంలేదు. దేశంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాల్లో విద్యుత్తు అవసరాలు వేరుగా ఉంటున్నాయి. గతంలో ఉత్తరాది రాష్ర్టాల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. ఇదే తెలంగాణకు అడ్వాంటేజ్‌గా ఉండేది. ఉత్తరాదిలో విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు.. మన దగ్గర డిమాండ్ ఎక్కువగా ఉండేది. మన దగ్గర డిమాండ్ తగ్గిన తర్వాత ఉత్తరాదిలో డిమాండ్ పెరిగిదే. దీనిని అనువుగా చేసుకొని ఉత్తరాది రాష్ర్టాల నుంచి విద్యుత్తు కొనేవారు. కానీ ఇప్పుడు దేశమంతటా ఎల్ నినో ప్రభావంతో కరెంట్ కష్టాలు తప్పేలా లేవు. పీక్ సమయంలో యూనిట్‌కు రూ.14 పెట్టి కొనుగోలు చేయాల్సి రావొచ్చని విద్యుత్తు రంగ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
విద్యత్తును పొదుపుగా వాడండి: భట్టి
రానున్న రోజుల్లో కరెంట్ కష్టాలు తప్పవని, అందుకే విద్యుత్తును పొదుపుగా వాడాలని ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 11వేల మెగావాట్లు ఉండాల్సిన పీక్ డిమాండ్ 16వేల మెగావాట్లకు చేరడం షాక్‌కు గురిచేసిందన్నారు. రాబోయే రోజుల్లో జల విద్యుత్తు ఉత్పత్తి కష్టమని.. థర్మల్ విద్యుత్తుపైనే ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. జలాశయాల్లో నీళ్లు లేక 2వేల మెగావాట్ల విద్యుత్తు నిలిచిపోయిందని పేర్కొన్నారు. పగటిపూట సోలార్ విద్యుత్తును వాడాలని అధికారులకు సూచించారు.
విద్యుత్తు కోతలు.. ఊరూరా నిరసనల జోరు