హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమారతో ముగ్గురు మంత్రులు భేటీ కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరు మంత్రులు మంగళవారం మీడియా ముందు కు వచ్చి, ఇదంతా సాధారణ విషయమంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, సమావేశంలో జరిగింది ఒకటని, బయటికి చెప్తున్నది మరొకటని అసలు కాంగ్రెస్ వర్గాలే పేర్కొంటున్నాయి. మంత్రుల భేటీతో సీఎం రేవంత్‌రెడ్డి సీటుకు ఎసరు తెచ్చే ప్రయత్నం ఏదో జరుగుతున్నదని కాంగ్రెస్ అనుకూల సోషల్‌మీడియానే ప్రచారంలోకి తెచ్చింది. భేటీపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అమెరికాలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని అలర్ట్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గందరగోళం పెరుగుతుండటంతో భేటీలో పాల్గొన్న వారిలో ఇద్దరు మంత్రులు మంగళవారం వేర్వేరుగా మీడియా ముందు కు వచ్చారు. మంత్రుల భేటీలో ఎలాంటి దాపరికాలు లేవని, పాలనాపరమైన అంశాలతోపాటు మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామని వివరణ ఇచ్చారు. మంత్రులు భేటీ కావడం సాధారణ విషయమని, అనవసర రాద్ధాంతం అవసరం లేదంటూ కొట్టిపడేశారు. దాపరికం ఏమీలేదని మంత్రులు చెప్తున్నా.. ఈ భేటీలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పాల్గొన్నారనే విషయాన్ని మాత్రం ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని వలస కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
వాస్తవానికి, నలుగురు మంత్రుల భేటీకి ముందే మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమావేశమైనట్టు ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్‌లోని ఒక రహస్య ప్రాంతంలో వారిద్దరి మధ్య దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిగినట్టు చెప్పుకొంటున్నారు. అనంతరం అడ్లూరి లక్ష్మణ్, జీవన్‌రెడ్డి కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వద్దకు వెళ్లినట్టు, ముగ్గురు కలిసి దాదాపు మరో గంటన్నరపాటు చర్చించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తర్వాత ఎవరికి వారు విడివిడిగా వెళ్లిపోయినట్టు సమాచారం.
సాయంత్రం లోక్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముగ్గురు మంత్రులు ఒకే కారులో ప్రజాభవన్‌కు వెళ్లారు. ముందు నలుగురు మంత్రులు రహస్యంగా సమావేశం కావాలని అనుకున్నా, ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగడుతాయని, చర్చల సారాంశం పూర్తిగా బహిర్గతం అవుతుందనే ఆలోచనతో ప్రజాభవన్‌లోనే భేటీ అయినట్టు తెలిసింది. సాధారణ సమావేశమే అని చెప్పి, ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టి మళ్లించడం కోసమే ముగ్గురు మంత్రులు ఒకే కారులో ప్రయాణం చేశారని వలస కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.
ముందుగా నలుగురు మంత్రులు ఫోన్ ట్యాపింగ్, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఆంధ్రజ్యోతి కథనాలపై చర్చించినట్టు ప్రచారం జరుగుతున్నది. నిర్మాణాత్మకమైన విమర్శలను స్వీకరించవచ్చుగానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే, ఊహాజనిత కథనాలు వండివార్చితే వ్యక్తిగతంగా, పార్టీపరంగా తీవ్రంగా నష్టపోతామని చర్చించుకున్నట్టు తెలిసింది. మంత్రుల సమావేశం కొనసాగుతున్న సమయంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వచ్చి వారితో చేరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సమావేశాన్ని ఆయనే ముందుండి నడిపించారని అంటున్నారు. ‘కత్తి ఎవరి చేతికి అందించాం.. యుద్ధం ఎవరితో చేస్తున్నాం?’ అంటూ ఆయన మంత్రులను నిలదీసినట్టు తెలిసింది.
ఖమ్మం వెళ్లి ‘టీడీపీని బతికించండి’ అని పిలుపు ఇవ్వడం.. పండ్ల చెట్టును నరుక్కునే పని కాదా? దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? అంటూ అసలు కాంగ్రెస్ మంత్రులను జీవన్‌రెడ్డి ప్రశ్నించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ బలోపేతం అయితే ఎవరి ఓట్లు చీలుతాయి? ఎవరి కొంపలు మునుగుతాయని ఘాటుగా మాట్లాడినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఓట్లే చీలిపోతాయని, ఇది బీజేపీకి సహకరించే ఎత్తుగడ అని వివరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తిగా చంద్రబాబు మాయలో పడి తెలంగాణలో కాంగ్రెస్‌కు తీరని నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీని కాపాడుకునేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా భట్టి విక్రమార్క ముందుపడాలని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిసింది.