హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అలవిగాని హామీలతో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కా రు.. ఇప్పుడు ఆ రుణాల రీస్ట్రక్చరింగ్‌కు అవకాశం ఇవ్వాలని లేకుంటే రాష్ర్టానికి అదనపు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సహా పలువురు ప్రభుత్వ పెద్దలు మంగళవారం ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో సమావేశమై మూకుమ్మడిగా ఈ విజ్ఞప్తి చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు.
అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను ఆర్థిక సంఘం ముందు పెడుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చితే దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యానికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక సంఘానికి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా రాష్ట్రాలతో పంచుకోని సెస్‌లు, సర్‌చార్జీలు పెరిగాయని, మొత్తం స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాలు తకువ వాటాను కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనంతరం 16వ ఆర్థిక సంఘం సభ్యులతో కలిసి చైర్మన్ అరవింద్ పనగరియా మీడియాతో మాట్లాడారు. నిర్దిష్ట అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను (సీఎస్ఎస్) రూపొందించేందుకు అవసరమైన స్వయం ప్రతిపత్తిని రాష్ర్టాలకు కల్పించాలని, అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా కేంద్ర పథకాల్లో మార్పులకు అవకాశం కల్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని తాము కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అంతకు ముందు చెప్పారు.