Cyber Crime | ‘అమెజాన్‌లో పార్ట్‌టైమ్ జాబ్స్..’ అనే ప్రకటనను ఇన్‌స్టాలో చూశాడో యువకుడు. దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా వాట్సాప్‌కు కనెక్ట్ అయింది. తను అమెజాన్‌లో ఉద్యోగం కావాలని టైప్ చేయగానే.. ఐదు నిమిషాల తర్వాత ‘జాబ్స్ ఉన్నాయి’ అని ఓ లింక్ పంపి.. అందులో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అలాగే అతను రిజిస్టర్ చేసుకోవడంతో ప్రత్యేకంగా ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ అవడంతో పాటు.. అందులో రూ.80 యాడ్ చేశారు. ‘ఇదొక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇందులో రూ.200 వేస్తే, మీ డబ్బులకు కమీషన్ కలుపుకుని అవి డబుల్ అవుతాయి’ అంటూ ఆశపెట్టారు. రూ.200 యాడ్ చేయడం(టాస్క్)తో.. ఓ గంట తర్వాత అతని ఆన్లైన్ అకౌంట్లో రూ.250 వచ్చాయి.
వాటికి విత్ డ్రా ఆప్షన్ ఇవ్వడంతో సంతోషంగా తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. మరుసటి రోజు మళ్లీ ఆ యువకుడికి మెసేజ్ చేసి, ఇదే పార్ట్‌టైమ్ జాబ్ అని, టాస్క్‌ల ప్రకారం మనీ చెల్లిస్తే.. అంతకంతకూ లాభపడొచ్చని మేసేజ్ చేశారు. ఆశపడిన యువకుడు విడతల వారీగా రూ.1.4 లక్షల టాస్క్‌లు పూర్తి చేశాడు. చివరికి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనుమతి లేదని, తన బాస్‌తో చాట్ చేయాలని మరో లింక్ పంపారు. చాట్ చేయగా మరో రూ.50 వేల టాస్క్ పూర్తి చేస్తేనే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడంతో.. మోసమని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీసు యంత్రాంగం అన్ని విధాలుగా ప్రజలకు సైబర్ క్రైమ్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తుండటంతో సైబర్ దొంగలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. గతంలో లోన్ యాప్‌లతో ఇబ్బందులకు గురిచేసిన చైనా ఆర్థిక మోసగాళ్లు.. తాజాగా మరో కొత్త ఎత్తుగడతో వచ్చారు. సోషల్ మీడియా వేదికగా పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ల ప్రకటనలు గుప్పిస్తూ.. ఔత్సాహికులకు ఎరవేస్తున్నారు. దీంతో చాలామంది రూ.వేలల్లో నష్టపోతుండగా, డబ్బుపై ఆశ ఉన్న కొందరు మాత్రం రూ.లక్షల్లో మోసపోతున్నారు. ఇలాంటి కేసులు కొత్తగా తెలంగాణలోనూ నమోదవుతున్నట్టు సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ కొత్త ఆర్థిక మోసాల బారిన పడిన వారిలో హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉన్నారు. బాధితుల సంఖ్య కూడా దాదాపు 250 పైనే ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఈ కొత్త తరహా మోసంలో మొదట బాధితులకు పార్ట్‌టైమ్ జాబ్స్ చూపిస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టు పెడతారు. వాటిని చూసి రిప్లయ్ ఇచ్చినా, క్లిక్ చేసినా వెంటనే వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లు ఓపెన్ అవుతాయి. తర్వాత రిజిస్ట్రేషన్ కోసం కొన్ని లింకులు పంపి.. వాటిల్లోనే ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. వెంటనే ఆయా కంపెనీల ప్రతినిధులమంటూ చాట్‌లోకి వస్తారు. మొదట వారే అకౌంట్లో కొంత డబ్బులు వేసి నమ్మిస్తారు. ఆ తర్వాత రూ.100 నుంచి రూ.500లోపులో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. వాటిని విత్ డ్రా చేసుకోవడానికి మరో కొత్త టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ పూర్తి చేస్తే.. వారి ఆన్లైన్ అకౌంట్లో ఆ డబ్బులకు సంబంధించిన కమీషన్ యాడ్ అవుతుంది. వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే.. కొత్త టాస్క్ పూర్తి చేయాల్సిందే. ఇలా వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టించి విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించరు. ఒక్కసారి వీరి వలలో చిక్కిన తర్వాత.. అప్పో సప్పో చేసి డబ్బులు కట్టాల్సి వస్తుంది. లేదంటే అంతవరకు చాలనుకొని మిన్నుకుండిపోవాలి.
లక్షల రూపాయల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఓవర్ లిమిట్ అయిందని.. మరో అకౌంట్ తీయించి, ఎక్కువ డబ్బులు కట్టిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కళ్లముందే లక్షల్లో కనిపిస్తున్న తమ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే కొత్తవారిని ఇందులో జాయిన్ చేయాలనే నిబంధన విధిస్తారు. దీంతో కట్టిన డబ్బులు రావాలంటే చచ్చినట్టు కొత్తవారి కోసం వేట ప్రారంభిస్తున్నారు బాధితులు. ఇలా ఎంతమందిని జాయిన్ చేసినా, డబ్బులు తిరిగి తమ అకౌంట్‌కు రాకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించడానికి వారికి చాలా సమయం పడుతుంది. కొందరు అత్యాశకు పోయి రూ.30 నుంచి రూ.60 లక్షల వరకు మోసపోయారు. ఈ కొత్త తరహా ఆర్థిక కుట్రను చైనా కేంద్రంగా కొనసాగిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. లోన్ యాప్స్‌లాగే.. ఈ కొత్త దందాకు కూడా మనవారిని అడ్డంపెట్టుకొని కథంతా నడిపిస్తున్నారు. సాంకేతికతతో డబ్బులను క్రిప్టోగా మార్చి చైనాకు చెందిన అకౌంట్లలోకి జమ చేసుకుంటున్నారు.
యువత అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా ద్వారా, నేరుగా ఫోన్లు చేసి అధిక వేతనానికి పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లు ఉన్నాయని చెప్పినా, తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు పొందొచ్చని చెప్పినా, ఆ ప్రచారాలకు, ప్రలోభాలకు లొంగవద్దు. ఎప్పటికైనా కష్టార్జితమే శాశ్వతం. కష్టపడకుండా డబ్బులు వస్తాయనే ఆశకుపోయి.. ఉన్న డబ్బును పోగొట్టుకోకండి. ఆన్లైన్ ద్వారా చేసే ఏ లావాదేవీలోనైనా మోసం చేసేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సకాలంలో ఫిర్యాదు చేస్తే.. డబ్బులు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది.
– కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైమ్ ఏసీపీ, హైదరాబాద్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇద్దరిని బురిడీ కొట్టించారు. రూ. కోటివరకూ వారినుంచి దండుకొన్నారు. వివరాల్లోకెళితే, హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, బంజారాహిల్స్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు టెలిగ్రామ్‌లో వచ్చిన మెసేజ్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మారు. విడతలవారీ ఓ వ్యక్తి రూ.56 లక్షలు.. మరో వ్యక్తి రూ.48 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన సదరు వ్యక్తులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.