సంగెం,మార్చి 11: గ్యాస్ పైసలే పడుతలేవు.. ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా పైసలైతే వస్తలేవు సార్.. అని కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను సంగెం, ఖిలావరంగల్ మండలాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఇందులో ఉచిత బస్సుతో పాటు ఆడపడుచులకు గ్యాస్ పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో గ్యాస్ పైసలు పడుతలేవు అని మహిళలు చెప్పడంతో ఎమ్మెల్యే ఏమైనా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. ఎందుకు పడుతలేవు అని ఎంపీడీవో రవీందర్‌ను అడిగితే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, అందులో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే గ్యాస్ పైసలు బకాయిలు మొత్తం ఒకేసారి పడుతాయని మహిళలకు సర్దిచెప్పారు.