హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన మిస్‌వరల్డ్ పోటీల సందర్భంగా అందాల భామల విందు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ‘దివాలా’ మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం మరోవైపు మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా అందాల భామలకు కేవలం రెండు రోజుల డిన్నర్‌కు ఏకంగా రూ.6.25 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. చౌమహల్లా ప్యాలెస్, రాష్ట్ర సచివాలయంలో విందు కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్టు సమచారం. దీనికి సంబంధించి పర్యాటక శాఖ టెండర్లు పిలిచిన సర్యులర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ సర్క్యులర్ ప్రకారం మిస్‌వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా, తెలంగాణ సచివాలయంలో డిన్నర్, ఈవెంట్ మేనేజ్మెంట్ పనుల కోసం రూ.6.25 కోట్లకు టెండర్లను పిలిచింది.
మిస్‌వరల్డ్-2025 ఈవెంట్లో భాగంగా అందాల భామలకు మే 13న చౌమహల్లా ప్యాలెస్‌లో, మే 18న సచివాలయంలో ప్రభుత్వం విందు ఏర్పాటుచేసింది. చౌమహల్లా ప్యాలెస్‌లో విందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుటుంబాలూ హాజరయ్యాయి. ఇక్కడ భోజనం కోసం ఒక్కో ప్లేట్‌కు రూ.లక్ష చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఖండించిన పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చౌమహల్లా ప్యాలెస్‌లో ప్లేట్ భోజనం ఖరీదు కేవలం రూ.8,200 మాత్రమేనని వెల్లడించారు. కానీ రెండు డిన్నర్ల కోసం రూ. 6.25 కోట్లు ఖర్చు చేశారంటే ప్లేట్ ఖరీదు లక్ష అన్న ఆరోపణలు నిజమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మే 18న అందాల భామలు సచివాలయాన్ని సందర్శించారు. సీఎంతోపాటు ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల కుటుంబాలు హాజరయ్యాయి.
ఇక్కడ వారికి భోజనం కూడా పెట్టలేదు కానీ హై-టీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలు చకినాలు, మురుకులు ఇలా ఇతర వంటకాలను ఏర్పాటుచేశారు. ఈ విధంగా రెండు ఈవెంట్ల కోసమే పర్యాటక శాఖ రూ.6.25 కోట్లు ఖర్చు చేసిందని, 25 రోజులపాటు జరిగిన ఈవెంట్లో ఇంకెన్ని కోట్లు ఖర్చు చేసిందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముందు నుంచే మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు ప్రభుత్వం దివాలా తీసిందని మొత్తుకుంటూనే మరోవైపు వందల కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం అవసరమా అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఖర్చు కేవలం రూ. 27 కోట్లు మాత్రమేనని పేర్కొంది.
అందాల భామలకు చౌమహల్లా ప్యాలెస్, సచివాలయంలో భోజనం కోసం ప్రభుత్వం రూ. 6.25 కోట్లు ఖర్చు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలకు పథకాలు అమలు చేసేందుకు పైసలు లేవు గానీ అందాల భామలకు కోట్లకు కోట్లు పెట్టి విందులు ఇచ్చేందుకు మాత్రం పైసలున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో ప్లేట్‌కు రూ. లక్ష పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు.