Heart Stroke | వేములవాడ, నవంబర్ 18 : బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న వంట మనషులకు గత తొమ్మిది నెలల నుంచి జీతాలు అందడం లేదు. దీంతో వారికి బతుకుదెరువు కష్టంగా మారింది. కుటుంబ పోషణ భారంగా మారడంతో వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు పాలైన ఓ వంట మనిషి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది.
వేములవాడ పురపాలక సంఘంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో 2010 నుంచి వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం కూడా యధావిధిగా విధులకు హాజరైంది. వంట చేస్తుండగానే ఆమె గుండెపోటుకు గురైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తొమ్మిది నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో అప్పులు కూడా ఎక్కువయ్యాయి. వీటన్నింటిని ఆలోచిస్తూ తీవ్ర ఒత్తిడితో ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.