బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 5: కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని 12 రోజుల పాటు హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ చేసిన ఆమరణ నిరాహార దీక్షను గురువారం విరమించారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీస్పీకర్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం, కల్లుగీత కార్మికుల సమాఖ్య మాజీ చైర్మన్ రవికుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణచందర్రావు, సోషల్ జస్టిస్ పార్టీ ఇన్చార్జి కేవీగౌడ్, అంబేద్కర్ ఆజాదీ అధ్యక్షుడు నరహరి తదితరులు సిద్ధేశ్వర్‌కు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముగ్గురు బీసీ నాయకులు 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. బీసీ డిక్లరేషేన్ అమలు కోసం ఐక్య న్యాయపోరాటానికి సిద్ధమయ్యామని తెలిపారు.