హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): జనగణనలో భాగంగా కులగణన చేయాలంటే చట్టసవరణ తప్పనిసరి అని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోషన్రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టంలో లేని విషయాన్ని కార్యనిర్వాహక నిబంధనల ద్వారా అమలుచేయడం రూల్స్‌కు విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసినట్టు తెలిపారు.
ఫలితంగా 2011 కులగణన నివేదిక పనికిరాదని, 2021లో సుప్రీంకోర్టులో కేంద్రమే అఫిడవిట్ దాఖలు చేసి అంగీకరించిందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీలు రాజ్యాంగ షెడ్యూళ్లలో ఉన్నందున, ఆయా వర్గాల గణన చట్టబద్ధమేనని, ఓబీసీలకు అలాంటి చట్టబద్ధ గుర్తింపు లేనందున జనగణన చట్టాన్ని సవరించడం తప్పనిసరి స్పష్టంచేశారు.