హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఐదేండ్ల బీబీఏ-ఎల్ఎల్బీ, టైపు రైటింగ్ పరీక్షలు ఒకే షెడ్యూల్లో జరుగనున్నాయి. దీంతో రెండు పరీక్షలకు హాజరయ్యేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టైపు రైటింగ్ పరీక్షలు వాయిదావేయాలని కోరుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఐదేండ్ల బీబీఏ, ఎల్ఎల్బీ కోర్సు సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. జూలై 10 నుంచి 20 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. సాంకేతిక విద్యామండలి టైపు రైటింగ్ హయ్యర్ పరీక్షను జూలై 18న నిర్వహించనున్నది. 18వ తేదీన బీబీఏ విద్యార్థులకు ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ పేపర్‌కు పరీక్ష నిర్వహించనున్నారు. ఒకే తేదీన రెండు పరీక్షలుండటంతో ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో టైపు రైటింగ్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని అభ్యర్థులు కోరుతున్నారు.