ఖైరతాబాద్, మార్చి 9 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో బంజారాలకు న్యాయం జరుగలేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ ఎంపీ ధరావత్ రవీంద్ర నాయక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1969 తొలి తెలంగాణ ఉద్యమంతో పాటు 1973లో విద్యార్థి నేతగా బంజారా, లంబాడీ సమస్యల పరిష్కారానికి గళమెత్తానని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం లంబాడ గిరిజనులకు న్యాయం చేస్తుందని నమ్మి 2019లో ఆ పార్టీలో చేరానని చెప్పారు. నాలుగేండ్ల కాలంలో బంజారా, లంబాడీ సమస్యలను కేంద్రం ముందు ఉంచితే ఏ ఒక్కదానినీ పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీతో ఒరిగేదేముండదని అర్థమై రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఏ పార్టీలో చేరుతానన్నది త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు.