Bangaru Purugu | బింగన్నలు బంగారమాయే.. అసలు బింగన్న ఏంటి..? అవి బంగారం కావడం ఏంటి..? అనే సందేహం రావొచ్చు. అవును మీ సందేహం నిజమే. ఎందుకంటే బంగారం పురుగుగా ప్రాచుర్యం ఉన్న ఈ బింగన్నలు ఈ తరం వారికి తెలిసి ఉండదు. రెండు దశాబ్దాల క్రితం వరకు గ్రామాల్లో, వ్యవసాయ పొలాల్లో విరివిగా కనిపించేవి. పొలం గట్ల వద్ద ఉండే ర్యాల, మోదుగ, తాటి చెట్లపై ప్రత్యక్షమై, కనువిందు చేసేవి. అందరి దృష్టిని ఆకర్షించేవి.

మరీ ముఖ్యంగా పిల్లలకు బింగన్నలంటే ఎంతో ఇష్టం. వ్యవసాయ పొలాలకు, బావుల వద్దకు వెళ్లే పిల్లలు.. బింగన్నలను పట్టుకొని, అగ్గిపెట్టెల్లో భద్రంగా దాచుకొని అపురూపంగా చూసుకునేవారు. వాటికి ఆహారంగా తుమ్మ, ర్యాల ఆకులను వేసేవారు. ఒకట్రెండు రోజుల వరకు వాటిని అగ్గిపెట్టెల్లోనే భద్రంగా దాచి ఉంచేవారు. ఆ సమయానికి అవి తెలుపు రంగులో గుడ్లు పెట్టేవి. వాటిని చూసి పిల్లలు ఎంతో సంబురపడిపోయేవారు. నా బింగన్న గుడ్డు పెట్టిందంటే.. నా బింగన్న గుడ్డు పెట్టిందని ఉత్సాహంతో గంతులేసేవారు. పిల్ల బింగన్నల అందం మరింత అపురూపం. లేలేత బంగారు వర్ణంతో మెరుస్తూ, చూపు తిప్పుకోలేని అందంతో కనువిందు చేసేవి.

ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పురుగులను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఉత్తర తెలంగాణలో బంగారు పురుగు, అని, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జీరంగి పురుగు, మరికొన్ని ప్రాంతాల్లో బింగన్న అని పిలుస్తారు. పేరు ఏదైనా.. ఊర్లలోని పిల్లలకు తమ బాల్యంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చే బింగన్నలు నిజంగా బంగారు పురుగులే. గత కొన్ని సంవత్సరాలుగా కనుమరుగైన ఈ బంగారు పురుగు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలోని గంధం నారాయణ తోటలో కనిపించింది. ప్రస్తుతం ఈ బింగన్న ఫోటో వైరల్ అవుతోంది.