కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి సాయి భగీరథ్ బాగోతం రచ్చరచ్చ అవుతున్నది. ఓ బాలికపై లైంగికదాడియత్నం ఘటనలో అయనపై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైంది. ఈ విషయంలో అమ్మాయి కుటుంబంపై నెపం నెట్టడంతోపాటు సదరు కుటుంబమే బ్లాక్మెయిల్ చేసిందని చిత్రీకరించడానికి సాయి భగీరథ్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అతడి వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. బాలిక కుటుంబం ఈ నెల 9న పేట్ బషీరాబాద్ స్టేషన్లో బండి సాయి భగీరథ్‌పై పలు ఆధారాలతో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా దాదాపు ఆరు గంటల డ్రామా తర్వాత తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చేందుకు కొంత మంది ప్రయత్నించారని, దానికి బాలిక తల్లిదండ్రులు ససేమిరా అనడంతో విఫలమైందని సమాచారం. ఈ క్రమంలో ఆ అమ్మాయి కుటుంబంపై ముందుగా ఫిర్యాదు చేశామని చెప్పుకొని అందర్నీ నమ్మించేందుకు భగీరథ్ ఆగమేఘాల మీద కరీంనగర్ రెండో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. బాలిక కుటుంబాన్ని ఇరికించి బదనాం చేసే ప్రయత్నంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదే ప్రస్తుతం భగీరథ్ మెడకు చుట్టుకున్నది. ఈ నెల 8న సాయంత్రం కరీంనగర్ టూటౌన్ పోలీసుస్టేషన్లో ఆయన ఇచ్చిన ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారంటే..
‘నాకు కామన్ స్నేహితుడి ద్వారా అమ్మాయి పరిచయమైంది. అందరం కలసి సోషల్‌గా మూవ్ అ య్యాం. ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగించాం. నేను వాళ్ల ఇంట్లో ఫంక్షన్లకు కూడా వెళ్లాను. గ్రూప్ గ్యాదరింగ్స్ లో కలిసే వాళ్లం. విజయవాడ, అరుణాచలం, తిరుమల వంటి ప్రదేశాలకు ట్రిప్పులకు కూడా వెళ్లాం. వీటన్నింటికీ అమ్మాయితో కలిసే వెళ్లాను. కొంతకాలం తర్వాత ఆ కుటుంబం ప్రవర్తన మారిపోయింది. ఆమె తల్లిదండ్రులు నన్ను పిలిచి, ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోపాటు బెదిరింపులకు గురిచేశారు. నేను నిరాకరించడంతో నాపై వేధింపులు మొదలుపెట్టారు. శారీరక సంబం ధం ఉన్నట్టుగా ఆరోపణలతో సహా నాపై తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు చేస్తామని బెదిరించారు.
వారు నానుంచి గణనీయమైన మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. నేను వారి ఒత్తిళ్లకు భయపడి అమ్మాయి తండ్రికి రూ.50 వేలు ఇచ్చి నన్ను వదిలేయాలని కోరాను. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు రూ.5 కోట్లు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటుందని చెప్తూ నన్ను నిరంతరం మానసిక వేధింపులు, బలవంతానికి గురిచేశారు. నా ఫ్రెండ్స్‌తో కూడా ఆ అమ్మాయి ఇలాగే వ్యవహరిస్తే నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో 2026 ఏప్రిల్ 21న ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని సదరు కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలి’ అని తన ఫిర్యాదులో భగీరథ్ పేర్కొన్నాడు. ఆ మేరకు హుటాహుటిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
భగీరథ్ తాను బయట పడేందుకు అనుసరించిన ఫిర్యాదు వ్యవహారం ఇప్పుడు బెడిసికొట్టింది. ఫిర్యాదులో ఏ ఒక్క అంశం కూడా స్పష్టంగా లేదు. ప్రధానంగా అ బాలికతో ఎప్పటి నుంచి సబంధాలు కొనసాగిస్తున్నాడో చెప్పలేదు. రూ.50 వేలు ఎప్పుడు ఇచ్చాడో పేర్కొనలేదు. ఒక వేళ రూ.50 వేలు ఇస్తే నగదు రూపంలో ఇచ్చాడా?, లేక ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా పంపాడా?, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడా? చెప్పలేదు. ఎప్పటి నుంచి అతడిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారో పేర్కొనలేదు. 2026 ఏప్రిల్ 21న నిర్మల్‌లో ఆమెపై కేసు నమోదైందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కానీ అక్కడ కేసు నమోదు కాలేదు. భగీరథ్ చెప్పినట్టుగా ఫిర్యాదు ఇచ్చి ఉంటే.. అప్పుడే ఇతను కూడా ఎందుకు ఫిర్యాదు చేయలేదనే విషయంలో స్పష్టత లేదు. రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా, లేదంటే చనిపోతానని ఆ అమ్మాయి తల్లి బెదిరించినట్టు సాయి భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తే రూ.50 వేలు ఇచ్చానని చెప్తున్నారు. అసలు ఏ తప్పూ చేయకుంటే రూ.50 వేలు ఇవ్వాల్సిన అవసరం ఏమిచ్చింది? రూ.5 కోట్లు వాళ్లు ఏ ఆధారంతో అడిగారు?, ఇతను రూ.50 వేలు ఎందుకిచ్చారు?, రూ.50 వేలు ఇవ్వకముందే కేసు ఎందుకు పెట్టలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కరీంనగర్ రెండో ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదును లోతుగా చూస్తే ఇదంతా వ్యూహాత్మకంగా ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఈ నెల 8న అమ్మాయి తల్లిదండ్రులు పలు ఆధారాలతో పక్కాగా పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. నిజానికి గతంలోనూ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు వారి వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ తీసుకొని వెళ్లినట్టు తెలుస్తున్నది.
అక్కడి సమాచారాన్ని వెంటవెంటనే ఆ స్టేషన్‌కు చెందిన కొంత మంది భగీరథ్ కుటుంబానికి చేర్చడంతో కేసు తప్పదని భావించి భగీరథ్ కుటుంబ సభ్యులు రూట్ మార్చారని పలువర్గాలు భావిస్తున్నాయి. అమ్మాయి తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆధారాలను బయటపెడితే.. అవి వేరే పరిస్థితికి దారి తీస్తాయని భావించి ముందుగానే భగీరథ్ ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అమ్మా యి తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి బాలిక తో భగీరథ్ ఉన్న ఫొటోలు, వివిధ ప్రాంతాల్లో తిరిగిన వీడియో ఫుటేజీలు చూపిస్తే.. అవన్నీ తన ఫిర్యాదులోనే ముందుగా తానే చెప్పాను కదా? అని చెప్పి తప్పించుకోవాలన్న ఉద్దేశంతోపాటు ఒక వ్యూహంతోనే హడావుడిగా కరీంనగర్లో ఈ ఫిర్యాదు ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్, మే 9 (నమస్తే తెలంగాణ): ఓ మహిళ తన మైనర్ కూతురును అడ్డం పెట్టుకొని తనను హనీట్రాప్‌లో దించిందని, గతంలో వేరేవాళ్లను ఇలానే ఇబ్బంది పెడితే నిర్మల్‌లో ఏప్రిల్ 21న ఆమె కుటుంబంపై కేసు పెట్టారని బండి సాయి భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు నిర్మల్‌లో సదరు బాలికపై ఎలాంటి కేసు నమోదు కాలేదని శనివారం జిల్లా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిలను వివరణ కోరగా నిర్మల్‌లో బాలికపై, ఆమె కుటుంబంపై కేసు నమోదైనట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఇక్కడ ఎలాంటి కేసూ నమోదు కాలేదని స్పష్టంచేశారు.
తనలాగే మరికొంత మందిని ఆ అమ్మాయితోపాటు కుటుంబసభ్యులు బ్లాక్మెయిల్ చేశారని, ఆ మేరకు కొందరిచ్చిన ఫిర్యాదుతో నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో 2026 ఏప్రిల్ 21న ఆ అమ్మాయిపై ఎఫ్ఐఆర్ నమోదైందని సాయి భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ వివరాలు ఆరా తీస్తే నిజానికి ఏప్రిల్ 21న నిర్మల్ ఠాణాలో 2 కేసులే నమోదయ్యా యి. అందులో ఒకటి సూసైడ్ కాగా, మరొకటి దొంగతనం కేసు.
ఆ అమ్మాయి పేరుతో నిర్మల్ ఠాణాలో ఎలాంటి కేసూ నమోదు కాలేదు. అంటే ఆ బాలిక కుటుంబాన్ని అభాసుపాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారా?, ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో? అని ఊహించి ముందుగానే నిర్మల్ ఠాణాలో ఎవరితోనైనా కేసు పెట్టించే ప్రయత్నం చేశారా? ఆ తదుపరి కేసు నమోదైందా? లేదా? అన్న వివరాలు తెలుసుకోలే దా?, లేదా వీరు పురమాయించిన వ్యక్తులు భగీరథ్‌కు ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.