పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేస్తూ ఏపీతో ఒప్పందానికి సిద్ధమైన రేవంత్ సర్కార్ చర్య.. తెలంగాణ సాగునీటిరంగానికి మరణ శాసనం రాయనున్నది. అటు కృష్ణాలోనే కాదు, ఇటు గోదావరి లోనూ మన నీటిహక్కులకు తీవ్ర విఘాతం కలుగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా.. శ్రీరాంసాగర్, దేవాదుల ఆయకట్టుకు మున్ముందు పెనునష్టం తప్పకపోవచ్చని తెలంగాణ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరీ(జీసీ) రివర్ లింక్ పేరిట కేంద్రం దన్నుతో ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో గోదావరిలోనూ తెలంగాణ నీటి హక్కులకు పూర్తిగా విఘాతం కలుగనున్నది. అంతేకాదు దేవాదుల ప్రాజెక్టుకు ప్రాణాధారమైన సమ్మక్కసాగర్ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నది. ఈ అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే.. కేంద్రం ప్రతిపాదనలు చేయడం, రేవంత్ సర్కార్ ఉత్సాహంతో ముందుకు సాగడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అసమర్థ కారణంగా గోదావరిలో తెలంగాణ నీటి వాటాకు చెల్లుచీటీ రాసిచ్చే పరిస్థితి దాపురించిందని ఇంజినీర్లు, తెలంగాణ జలరంగ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కేంద్రంతో చర్చల అంశాలు బయటకు పొక్కకుండా గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఏపీ కుట్రలకు కేంద్రం దన్ను గోదావరిలో తెలంగాణ నీటివాటాను హరించేందుకు ఏపీ చేస్తున్న కుట్రలకు కేంద్రం దన్నుగా నిలుస్తున్నది. ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి 200 టీఎంసీల వరద జలాలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా పోలవరం-బనకచర్లను ప్రతిపాదించింది. ఆ తరువాత పేరుమార్చి నల్లమలసాగర్ లింక్‌ను తెరమీదికి తెచ్చింది. అయితే వరదజలాల ఆధారిత ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు అనుమతులిచ్చే, నిధులు మంజూరు చేసే నిబంధనలు లేకపోవడంతో రూటుమార్చింది. పోలవరం-బనకచర్లను జీసీ లింక్‌లో భాగంగా చేపట్టేందుకు సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించుకున్నది. దీనికి అనుగుణంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, పోలవరం- నల్లమలసాగర్ అనుసంధానం, గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టులను మేళవిస్తూ కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. ఢిల్లీలో ఈ ఏడాది మే నెలలో కేంద్ర జల్‌శక్తి కార్యాలయం వేదికగా రెండు పర్యాయాలు సమావేశాలు నిర్వహించింది. తమ ప్రతిపాదనలను వివరించింది. ఆ తర్వాత కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలోనే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ పరస్పర చర్చలు కొనసాగించారు. నదుల అనుసంధానం ద్వారా దక్కాల్సిన నీటివాటాపై పేచీ పెడుతున్న కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు స్వయంగా కేంద్రమే మధ్యవర్తిత్వం వహించడం గమనార్హం.
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌నకు ఎన్వోసీ జారీ చేయాలని, తద్వారా బనకచర్లకు అనుమతులిస్తామంటూ కేంద్రమే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు పోలవరం నుంచి గోదావరి జలాల డైవర్షన్ ద్వారా వచ్చే 16 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఎగువన బెడ్తి-వర్ద లింకును, దాంతోపాటుగా నావలి రిజర్వాయర్ విస్తరణకు నిధులు సాయం చేస్తామని కర్ణాటక రాష్ర్టానికి నజరానాలు ప్రకటించింది. ఇటీవల తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సమక్షంలోనే ఆయా అంశాలపై ముగ్గురు సీఎంలు చర్చించుకున్నారు. సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. అందుకు అనుగుణంగా కేంద్రజల్‌శక్తి శాఖనే తాజాగా ఒప్పంద పత్రాలను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. సెప్టెంబర్ తొలివారంలో ఎంవోయూలపై ముఖ్యమంత్రులు సంతకాలు చేసేందుకు ముహూర్తం పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే, తెలంగాణ జలహక్కులకు గొడ్డలిపెట్టులాంటి కేంద్రం ప్రతిపాదనలకు సీఎం రేవంత్‌రెడ్డి సై అంటుండడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది.
బనకచర్ల వ్యవహారంలో మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు వేస్తున్న అడుగులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మడుగులొత్తుతున్నారని స్పష్టంగా తేలిపోతున్నది. కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహిస్తున్న సమావేశాల్లో తెలంగాణ ఇంజినీర్లను భాగస్వాములను చేయకుండా గుట్టుగా చర్చలు కొనసాగిస్తూ వస్తుండటమే ఇందుకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ లేవనెత్తుతున్న అంశాలన్నీ దాదాపు కృష్ణా జలాలకు సంబంధించినవే. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల డీపీఆర్‌లకు అనుమతులు, నీటివినియోగ పరిణామాల నమోదుకు టెలిమెట్రీల ఏర్పాటు, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విస్తరణ, ఔట్‌బేసిన్‌కు జలాల మళ్లింపు వంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర విభజన నాటి నుంచీ తలెత్తుతున్న జలవివాదాలే.
వీటిపై కేంద్రానికి గత పన్నెండేండ్లుగా అనేకమార్లు విజ్ఞప్తులు సమర్పించడంతోపాటు ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని ఇంజినీర్లు వివరిస్తున్నారు. వాటన్నింటికీ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినప్పుడే పరిష్కారం లభించే ఆస్కారమున్నదని చెప్తున్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌తోపాటు ఇతర వివాద అంశాలు కూడా న్యాయస్థానాల్లో ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయితే తప్ప తెలంగాణ లేవనెత్తిన అంశాలకు పరిష్కారం లభించబోదనేది ఇంజినీర్లు తేల్చిచెబుతున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి, కేఆర్ఎంబీ సైతం పలు సందర్భాల్లో తేల్చిచెప్పాయి. మరోవైపు ట్రిబ్యునల్ వాదనలు సైతం తుది దశకు చేరుకున్నాయి. అయినా వివాదాల పరిష్కారానికి గతంలో ఎన్నడూలేనివిధంగా కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడం, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉత్సాహం చూపడం గమనార్హం. ఈ హడావుడి మొత్తం ఏపీలోని చంద్రబాబు సర్కార్ చేపట్టనున్న పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసేందుకు తప్ప మరేమీ కాదని మొదటి నుంచీ ఇంజినీర్లు మొత్తుకుంటున్నారు.
పోలవరం-బనకచర్ల కోసం కేంద్రం జీసీ లింక్ ముసుగులో భారీ కుట్రకు తెరలేపింది. గోదావరిలో తెలంగాణ వాటాకు ఎసరుపెట్టింది. వాస్తవంగా దేవాదుల ఆయకట్టుకు సమ్మక్కసాగర్ బరాజ్ అత్యంత కీలకం. అంతేకాదు ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు సైతం నీటిని అందించాల్సి ఉంటుంది. మొత్తంగా బరాజ్ నుంచి 47 టీఎంసీలను వినియోగించుకునేందుకు ప్రణాళికలు ఉన్నాయి. అనుమతులు రావాల్సి ఉన్నది. అయితే ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఎన్వోసీ కావాలంటూ కేంద్రం మొదట కొర్రీలు పెట్టింది. ఇప్పుడు ఏకంగా ఆ 47 టీఎంసీల నీళ్లనే బనకచర్ల కోసం ప్రతిపాదించింది. సమ్మకసాగర్ బరాజ్ దిగువన తెలంగాణ ప్రస్తావించిన 47 టీఎంసీలు, ఛత్తీస్‌గఢ్ వాటా నీళ్ల నుంచి ఏపీకి దక్కే 45 టీఎంసీలను, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే క్రమంలో పరిగణనలోకి తీసుకొని 16 టీఎంసీలను, కర్ణాటక రాష్ట్రం చేపడుతున్న బెడ్తి వరద లింక్ ద్వారా తుంగభద్రలోకి వచ్చే 16 టీఎంసీలు.. అన్ని కలిపితే 124 టీఎంసీలు అందుబాటులో వస్తాయని లెక్కగట్టింది. ఆ జలాలను పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానానికిచ్చేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఒప్పందాలకు ఆమోదం తెలిపితే సమ్మక్కసాగర్ బరాజ్, తద్వారా దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదమున్నది.
గోదావరి నుంచి మళ్లించే జలాల్లో బేసిన్ రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని ట్రిబ్యునల్ అవార్డులోనే స్పష్టంగా ఉన్నది. జీసీ లింక్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలను మళ్లించాలని కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అందులో ఏపీకి 45 టీఎంసీలని తేల్చింది.
కానీ తెలంగాణ వాటాను తేల్చలేదు. మరోవైపు తెలంగాణకు గోదావరి జలాల్లో 968 టీఎంసీల వాటా ఉన్నది. ఇది కేంద్ర జలసంఘమే పలుమార్లు తేల్చిచెప్పిన లెక్క. అందులో దాదాపు 833 టీఎంసీలకు ఇప్పటికే అనుమతులున్నాయి. మిగిలిన టీఎంసీల వినియోగానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది. కానీ బనకచర్లకు ఆమోదం లభిస్తే భవిష్యత్తులో గోదావరిలో తెలంగాణ చేపట్టే ఏ ప్రాజెక్టుకు కూడా అనుమతులు వచ్చే అవకాశం లేకుండా పోతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అదీగాక బనకచర్లకు చారిత్రక రక్షణల కింద జలాలను కేటాయించుకునే అవకాశం లభిస్తుంది. మొత్తంగా తెలంగాణ వాటాకు రక్షణ పొందకుండా, బనకచర్లకు ఆమోదం తెలుపడమంటే నీటిహక్కులకు చెల్లుచీటీ పలికినట్టేననేది తేలిపోతున్నది.
బనకచర్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్రం చేసిన మరో దుర్మార్గ ప్రతిపాదన కూడా ఉన్న ది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలకు అనుమతులివ్వాలంటే ఏపీ అంగీకరించాలని షరతు విధించింది. అదీగాక సమ్మక్కసాగర్‌కు కేటాయించిన జలాలను వదులుకుంటే పాలమూరు ప్రాజెక్టుకు ఒప్పిస్తామనడం మరో కుట్ర.
ఎలాగంటే.. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అందులో 35 టీఎంసీలు మహారాష్ట్ర(14), కర్ణాటక(21) ఇప్పటికే వాడుకుంటున్నాయి. మిగిలిన 45 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ ఎగువన కృష్ణా బేసిన్లో వినియోగించుకునేందుకు గోదావరి అవార్డు అనుమతి ఇస్తున్నది. సాగర్ ఎగువనే వినియోగించాలనే నిబంధన నేపథ్యంలో.. ఆ జలాలు తెలంగాణకే దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్తున్నది. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ 45 టీఎంసీలతోపాటు మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి 45 టీఎంసీలను మొత్తంగా 90టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. కానీ ప్రస్తుతం హక్కుగా వచ్చే ఆ 45 టీఎంసీలకు, బనకచర్ల అనుమతులకు కేంద్రం ముడిపెట్టింది. అంటే.. మన నీళ్లను మనకిచ్చేందుకు షరతులు పెట్టడం గమనార్హం. కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు వస్తే ఆ వాటా ఏందనేది తేలిపోతుంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం కేంద్రం, ఏపీ కుట్రపూరిత ప్రతిపాదనలకు తలొగ్గుతూ సై అంటున్నది. తద్వారా ట్రిబ్యునల్ వాదనలకు ఎసరు వచ్చే ప్రమాదమున్నది. బనకచర్లకు ఆమోదం తెలిపితే ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వినిపిస్తున్న, ప్రతిపాదించిన వాదనలన్నీ వీగిపోయే ప్రమాదం పొంచి ఉన్నది.