చిక్కడపల్లి, జూన్ 22: ‘గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తక్షణమే ఆపాలి.. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీచేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై కేంద్రానికి ప్రేమ ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపొద్దు.. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు ఈ ప్రాంత నీళ్లగోస పట్టదా? తెలంగాణ గొంతెండుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? వారు వెంటనే స్పందించాలి’ అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ ఒంటెద్దు నర్సింహారెడ్డి అధ్యక్షతన ‘తెలంగాణ జలవనరులు-వ్యవసాయం-నాడు, నేడు, రేపు’ అన్న అంశంపై జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సాగునీటి రంగనిపుణులు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ప్రముఖ పాత్రికేయులు పరాంకుశం వేణుగోపాలస్వామి, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ పూర్వ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ పూర్వ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, ముక్యాల రవీందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.
సమైక్య రాష్ట్రంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించడానికి రెండు దశాబ్దాలు పట్టిందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 40 ఏండ్లు పట్టిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారని తెలిపారు. అద్భుతమైన ప్రాజెక్టును ఆయన కట్టి చూపితే ఆంధ్ర మీడియా, కొందరు నాయకులు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ అక్కసుతో, కుసంస్కారంతో కాళేశ్వరాన్ని తప్పుబడుతున్నారని ఆరోపించారు. దెబ్బతిన్న మూడు పిల్లర్లను మరమ్మతు చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నదని, తెలంగాణ ప్రజలు కూడా పన్నులు కడుతున్నారనే విషయాన్ని మరువొద్దని కోరారు. టీఎంసీ, క్యూసెక్, ప్రాజెక్ట్ అంటే తెలియని వాళ్లు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు పంపగానే కేంద్రం అనుమతి ఇస్తుందని, తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులకు ఈ ప్రాంత నీళ్ల గోస పట్టదా? అని నిలదీశారు. తెలంగాణ గొంతెండుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏపీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ తెలంగాణ ఆగం అవుతుంటే పట్టించుకోరా? అని ప్రశ్నించారు. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఇప్పటికీ సమీక్ష చెయ్యలేదని, పూర్తిచేసేందుకు కనీస ప్రయత్నమూ చేయడం లేదని మండిపడ్డారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నికరజలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలు చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు. నీళ్ల వాటాలు సాధించే పోరాటంలో కచ్చితంగా తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రెండు రాష్ర్టాల సీఎంలు మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని, అన్నిరంగాల వ్యక్తులతో చర్చించాలని డిమాండ్ చేశారు. బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్లోనూ చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఏపీలో తమ సొంత కూటమి ప్రభుత్వం ఉన్నదనే ఆ రాష్ర్టానికి కేంద్రం లాభం చేకూరుస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ వచ్చాకే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని సాగునీటి రంగ నిపుణుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే చెప్పారు. సీఎంగా కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల వల్లే రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయి తెలిపారు. 26వేల చెరువులు మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేయడంతో భూగర్భజలాలు పెరగడంతో పాటు మత్స్య సంపద పెరిగిందని తెలిపారు. 3 కోట్ల టన్నుల చేప ఉత్పత్తి పెరిగిందని, 5 మీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ పెరిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషప్రచారం జరుగుతుందని, అందుకే తాను రెండు పుస్తకాలను తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. బనకచర్లపై కేసీఆర్ ఒప్పుకున్నారంటూ కూడా విషప్రచారం జరుగుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏ ప్రాజెక్టు చేపట్టినా నాడు చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసి అడ్డుకున్నారని, అపెక్స్ కౌన్సిల్లోనూ అనుమతి రాకుండా అడ్డుతగిలారని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టు కోసం అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. వరదజలాల తరలింపుపై ఏపీ ప్రాంతానికే కాదని, అందరికీ హక్కు ఉంటుందని వివరించారు. నీటి లెక్కలన్నీ కేసీఆర్‌కు తెలుసని, సముద్రంలో కలిసే 3000 టీఎంసీల నీటిలో 1950 టీఎంసీలపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.