హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేన్లను నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని హెచ్ఎండీఏ స్పష్టంచేసింది. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాలు సరికాదని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిషేధానికి సంబంధించి సంవత్సరకాలంగా హెచ్ఎండీఏ నుంచి రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖకు తాము ఎలాంటి అభ్యర్థన పంపలేదని పేర్కొంది. గ్రామ పంచాయతీల పరిధిలోని అనధికార లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదని హెచ్ఎండీఏ తేల్చిచెప్పింది. అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరింది. ప్రసార మాధ్యమాలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని కోరింది.