వేములవాడ, సెప్టెంబర్ 13: ‘చేతనైత లేదు సారు.. పన్జేసుకొని బతికే ఓపిక లేదు. కొడుకు పైసలిత్తలేడు. ఎట్ల బతకాలె?’ అంటూ పోలీస్ అధికారి ఎ దుట ఓ వృద్ధుడు వాపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన వృద్ధుడు బాలసాని అంజయ్య మంగళవారం వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారిని కలిసి తన గోడు వెల్లబోసుకొన్నాడు. నాలుగున్నర ఎకరాల భూమి, బంగ్లాను కొడుకు మల్లేశానికి రాసిచ్చానని చెప్పాడు.
తన సంరక్షణకు కావాల్సిన పైసలు ఇవ్వాలని 2020లో ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా, నెలకు రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని, రెండు, మూడు నెలలు ఇచ్చి తర్వాత పట్టించుకోవట్లేదని వాపోయా డు. కోట్ల రూపాయల ఆస్తిని కొడుకుకు అప్పగించినా, కనీసం బతుకు వెళ్లదీయడానికి పైసలు ఇస్తలేడని కన్నీటిపర్యంతమయ్యాడు. కొడుకును పిలిపించి న్యా యం చేస్తామని వృద్ధుడిని డీఎస్పీ సముదాయించి ఇంటికి పంపాడు.