హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీసీ, ఓబీసీ సామాజికవర్గాల అభ్యున్నతి కోసం సామాజిక, ఆర్థిక కులగణనను వెంటనే కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా ప్రతిపాదనలు పంపాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహీర్‌కు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు విజ్ఞప్తి చేశారు. క్రీమీలేయర్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచాలని కోరారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన హన్స్‌రాజ్‌ను బేగంపేట్‌లోని హరితప్లాజాలో వకుళాభరణం గురువారం ప్రత్యేకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. బీసీల కీలకమైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాలపాటు చర్చించారు. ప్రతి మూడేండ్లకోసారి సమీక్షించి నాన్ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని పెంచాలని కేంద్ర నిబంధనలు ఉన్నా కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, పెంపుదల నిమిత్తం జాతీయ కమిషన్ సిఫారసు చేయాలని కోరారు. 30 ఏండ్లుగా ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల అభ్యర్థులు పూర్తి స్థాయిలో దొరకడం లేదని, ఉద్యోగ నియామకాల్లో బ్యాక్ లాగ్ విధానం అమలుకు సిఫారసు చేయాలని కోరారు.
కేంద్రం సుమారు 40 సామాజిక కులాలను ఓబీసీ జాబితాలో చేర్చని కారణంగా ఉన్నత అవకాశాలు కోల్పోవాల్సి వస్తున్నదని, ఇందుకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని కోరారు. మేరకు వినతి పత్రాలను చైర్మన్ హన్స్‌రాజ్‌కు అందజేశారు. అన్ని విషయాలపై తప్పకుండా దశలవారీగా జాతీయ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుందని హన్స్‌రాజ్ ఈ సందర్భంగా వివరించినట్టు తెలిసింది.