హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్‌కు (Azharuddin) మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శాఖల కేటాయింపులో మాత్రం కొత్త కొ ట్లాట మొదలైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముస్లింకు హోంశాఖ ఇచ్చారు. ఇప్పుడు కూడా హోంశాఖను నాకు కేటాయించి ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలి’ అని అజారుద్దీన్ సీఎం రేవంత్‌ను కోరినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తనకు హోం శాఖ ఇస్తేనే ముస్లిం మైనార్టీలు ప్రభుత్వాన్ని నమ్ముతారని, జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అనవసర చర్చలకు తావులేకుండా శాఖల కేటాయింపు వీలైనంత త్వరగా ముగించాలని అజారుద్దీన్ కోరినట్టు తెలిసింది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న కీలక శాఖలు ఎవరికీ ఇచ్చేది లేదని, మైనార్టీ వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పినట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌లో ఓడినా పోయేదేమీ లేదు.. హోంశాఖ మాత్రం ఇంకొకరికి ఇచ్చే ప్రసక్తి లే దని తెగేసి చెప్పినట్టు ప్రచార అవుతున్నది. దీం తో కొత్త మంత్రికి శాఖల కేటాయింపు జఠిలం గా మారిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
శాఖలులేని మంత్రిగా మరికొన్నాళ్లు అజార్.. 
అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి నాలుగు రోజులు అయ్యింది. ఈ రోజు వరకు ఆయనకు శాఖాలు కేటాయించ లేదు. సచివాలయంలో చాంబర్ ఇవ్వలేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదేరోజు, లేదా మరుసటిరోజు శాఖలు కేటాయించడం సంప్రదాయంగా వస్తున్నది. ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకునే ముందే అతనికి ఏ శాఖలు కేటాయించాలనేది సీఎం ఒక అంచనాకు వస్తారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అతనికి పోర్ట్‌ఫోలియో కేటాయిస్తారు. కానీ, ఇప్పటివరకు సీఎం ఆయనకు ఏ శాఖలు కూడా కేటాయించలేదు. క్రీడలు, మైనార్టీ సంక్షేమం కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రాథమికంగా ప్రతిపాదించినట్టు తెలిసింది.
ఈ ప్రతిపాదనలకు మంత్రి అజారుద్దీన్ ‘నో’ చెప్పినట్టు సమాచారం. తనకు హోంశాఖ ఇవ్వాలని అప్పుడు మాత్రమే మైనార్టీలకు న్యాయం చేసినట్టు అవుతుందని అజారుద్దీన్ కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. అయితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓడినా, గెలిచినా తన ప్రభుత్వానికి నష్టమేమీ లేదని, కానీ తన దగ్గర ఉన్న శాఖలు వేరొకరికి ఇచ్చేది లేదని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో తాను సోనియమ్మను కలిసి తన అభిప్రాయం చెప్తానని, అప్పటివరకు తనకు శాఖలే అవసరం లేదని అజారుద్దీన్ అన్నట్టు సమాచారం. ఆయన ఒకటి, రెండురోజుల్లో ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలిసి రేవంత్‌పై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాబట్టి శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావొచ్చని సమాచారం.
మైనార్టీ వర్గాల ఎదురుచూపులు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ముస్లిం సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వటంతో మైనార్టీల ఓటుబ్యాంకును చీల్చాలని కాంగ్రెస్ భావించింది. ఆలోచన వచ్చిందే తడవుగా అజారుద్దీన్‌కు పిలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. అయితే, అనంతర పరిణామాలు కాంగ్రెస్‌కు గుదిబండగా మారినట్టు పార్టీశ్రేణలు చెప్తున్నాయి. ఆయనకు ఏశాఖ కేటాయిస్తారని మైనార్టీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖ, వాణిజ్య పన్నులు తదితర కీలకశాఖలు ఉన్నాయి. వీటిలో నుంచి ఒక శాఖను అజారుద్దీన్‌కు ఇస్తారని, గతంలో కేసీఆర్ తమకు హోంశాఖ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హోం శాఖ ఇస్తుందని ఆశించారు. కానీ, హోంశాఖ ఇవ్వటానికి సీఎం నిరాకరిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఏ శాఖలు ఇస్తారోనని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అజారుద్దీన్‌కు ఇస్తామంటున్న క్రీడాశాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి వద్ద, మైనార్టీ సంక్షేమశాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్నాయి.