కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూలై 16: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని పురసరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన పండుగ అర్చన జాతీయ గీతాన్ని 75 సార్లు.. ఏడు గంటలపాటు ఆలపించారు. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో నివాసముంటున్న అర్చన స్థానిక అల్ఫోర్స్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశం కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు.
జాతీయ గీతాన్ని 75 సార్లు ఆలపించేందుకు రోజూ ఐదు గంటలపాటు సాధన చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వారిని సంప్రదించారు. వారి సూచన మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో సంపూర్ణ జాతీయ గీతాన్ని ఐదు చరణాలతో 75 సార్లు ఏడు గంటలపాటు ఆలపించారు. ఈ సందర్భంగా అర్చనను కరీంనగర్ సీపీ సత్యనారాయణ, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు అభినందించారు.