కొల్లాపూర్ రూరల్, మే 21 : వేసవిలో తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ‘నీళ్లున్నా.. నల్లా రాదు’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల పరిధిలోని గ్రామాలను ఈఈ సుధాకర్సింగ్, డీఈలు వెంకటేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఏఈ రామాంజనేయులు సందర్శించారు. తాగునీటి ఎద్దడి, లీకేజీలపై ఆరాతీశారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు కారణంగా దెబ్బతిన్న పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టినట్టు చెప్పారు. వేసవి ముగిసే వరకు నీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఈఈ అధికారులను ఆదేశించారు.