SIR Enumeration Doubts | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ అందరిలోనూ అనేక సందేహాలు. ఉన్న ఓటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. అడిగితే సాధికారికంగా సమాధానం చెప్పేవారూ లేరు. ఈ నేపథ్యంలో ‘సర్’పై సర్వసాధారణంగా వ్యక్తమవుతున్న 50 సందేహాలను తీర్చేందుకు, అనుమానాలను నివృత్తి చేసేందుకు నమస్తే తెలంగాణ చేస్తున్న ప్రయత్నమిది. అధికారుల నుంచి జవాబులు రాబట్టి పాఠకులకు వాటిని అందిస్తున్నది.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జరుగుతున్న వేళ ఓటర్ల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్వో ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకుంటే ఏం చేయాలి? బీఎల్వో ఇచ్చే ఎన్యుమరేషన్ పత్రంలో వివరాలు తప్పుగా నమోదు చేస్తే మరో పత్రం ఇస్తారా? పత్రం స్వీకరించిన తర్వాత తప్పు గుర్తిస్తే అప్పుడు ఏం చేయాలి? తప్పుగా నింపిన పత్రంలో కొట్టివేసి మళ్లీ వివరాలు భర్తీ చేయొచ్చా? రెండు రాష్ర్టాల్లోనూ ఓటు ఉంటే పరిస్థితేంది? ఇల్లు మారితే ఓటు పోతుందా ? 2002 ‘సర్’ జాబితాలో పేరు లేని వారి పరిస్థితేంది? నిర్ణీత డెడ్లైన్లో పత్రాలు ఇవ్వకుంటే ఓటు రద్దవుతుందా? కొత్తగా ఓటు కావాలంటే ఏం చేయాలి? తదితర సందేహాలు ఓటర్ల నుంచి పెద్దఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ ఈసీ అధికారులను సంప్రదించి సమగ్రమైన సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.
అసలు ‘సర్’ ఉద్దేశం ఏంది?
సమాధానం : అర్హులైన వారి ఓటు హక్కును కాపాడటం, అనర్హుల ఓట్లను ఏరివేయడమే ‘సర్'(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ఉద్దేశమని ఎన్నికల సంఘం చెప్తున్నది. డూప్లికేట్ ఓట్లను తొలగించడం, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను తీసివేయడంతోపాటు ఓటర్ల జాబితాను కచ్చితంగా ఉంచేందుకు ‘సర్’ సాయపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
బీఎల్వో ఇంటికి రాకపోతే ఏం చేయాలి?
ఎన్యుమరేషన్ పత్రాన్ని ఇవ్వడానికి బీఎల్వో ఇంటికి రాకపోతే సంబంధిత బీఎల్వో ఫోన్ నంబర్‌ను రాష్ట్ర ఎన్నికల శాఖ వెబ్సైట్ https:voters.eci. gov.in లేదా ఈసీఐ యాప్ ECINET ద్వారా తెలుసుకుని సంప్రదించవచ్చు. అలాగే ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్ 1950కు కాల్ చేసి కూడా సమాచారం పొందే అవకాశం ఉన్నది.
బీఎల్వో వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే?
‘సర్’ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందజేస్తారు. బీఎల్వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. బీఎల్వో వచ్చినప్పుడు ఇంట్లో ఒకసారి లేకపోయినా.. మరోసారి బీఎల్వో వచ్చినప్పుడు పత్రాలు తీసుకోవచ్చు. లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి ఫోన్ సాయంతో బీఎల్వోను సంప్రదించవచ్చు.
బీఎల్వో రెండు ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇస్తున్నారు.. ఎందుకు?
అవును. బీఎల్వోలు ఇచ్చిన రెండు ఫామ్‌లను నింపిన తరువాత ఒకటి వారు తీసుకొని, రెండో ఫామ్‌ని రసీదుగా మనకు అందజేస్తారు.
బీఎల్వో ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్‌లో పేరు, ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయి. ఏం చేయాలి?
ఫామ్‌లో కరెక్ట్ వివరాలను నమోదు చేసి ఇవ్వాలి. పరిశీలించి సవరణ చేస్తారు.
ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్వోకు ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటే ఏమౌతుంది?
ఎన్యుమరేషన్ ఫామ్‌లు తిరిగి ఇవ్వని ఓటర్లను బీఎల్వోలు తొలుత విచారిస్తారు. అయినప్పటికీ, ఫామ్ తిరిగి రాకపోతే గైర్హాజరు/మరణించడం/వేరేప్రాంతానికి వలస వెళ్లడం/బహుళ కార్డులు ఉండటం వంటి కారణాల క్యాటగిరీలో చేర్చుతారు. అలాంటి వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవు.
ఎన్యుమరేషన్ పత్రంలో వివరాలు తప్పుగా నమోదు చేస్తే, మరో పత్రం ఇస్తారా?
ఇస్తారు. పత్రం పూర్తిగా తప్పుగా నింపినా, పేజీ చిరిగిపోయినా.. లేదంటే ఉపయోగించలేని స్థితిలో ఉన్నా, బీఎల్వోలు అవసరాన్ని బట్టి మరో పత్రాన్ని అందిస్తారు.
మరో పత్రంలోనూ మునుపటి క్యూఆర్ కోడ్ ఉంటుందా?
ఎన్యుమరేషన్ పత్రాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ప్రతి పత్రాన్నీ గుర్తించడానికి సాయపడుతుంది. సంబంధిత క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యామ్నాయ పత్రాన్నే అధికారులు అందించే అవకాశం ఉన్నది.
ఎన్యుమరేషన్ పత్రాన్ని నింపి.. బీఎల్వోకు తిరిగి ఇచ్చిన తర్వాత ఆ పత్రంలో తప్పు రాశామని గుర్తిస్తే అప్పుడు ఏం చేయాలి?
వీలైనంత త్వరగా సంబంధిత బీఎల్వోకు ఆ విషయాన్ని చేరవేయాలి. పత్రం పరిశీలన దశలో ఉంటే అవసరమైన సవరణలు చేయడానికి అధికారులు సూచించే ప్రక్రియను అనుసరించాలి.
తప్పుగా నింపిన పత్రంలో కొట్టివేసి మళ్లీ వివరాలు భర్తీ చేయొచ్చా?
చిన్న దిద్దుబాట్లు మాత్రమే ఉంటే బీఎల్వో సూచన మేరకు సరిచేయొచ్చు. కానీ, ముఖ్యమైన వివరాలు పూర్తిగా తప్పుగా నమోదైతే కొత్త పత్రాన్ని ఉపయోగించడం మంచిది.
ఎన్యుమరేషన్ ఫామ్‌ను సమర్పించడానికి ఆధార్ నంబర్ కచ్చితంగా ఇవ్వాలా?
అవసరం లేదు. దరఖాస్తుదారు స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇవ్వొచ్చు.
నా ఎన్యుమరేషన్ ఫామ్‌లో ఫొటో తప్పుగా ఉన్నది. ఏం చేయాలి?
వివరాలు అన్నీ సరిగ్గా ఉండి ఫొటో తప్పుగా ఉంటే, ఫామ్‌లో కేటాయించిన స్థలంలో ఇటీవల తీసుకొన్న ఫొటోను అతికించి ఇవ్వాలి.
ఫామ్‌లు నింపడం పూర్తయ్యింది. బీఎల్వో ఎప్పుడు వస్తారు?
ఈసీ ఆదేశాల మేరకు.. ఒక్కో ఇంటిని బీఎల్వో కనీసం మూడుసార్లు సందర్శించాలి. జూలై 24లోపు పూరించిన పత్రాలను బీఎల్వో సేకరిస్తారు.
బీఎల్వోకు ఎన్యుమరేషన్ పత్రాన్ని ఇప్పటికే సమర్పించా. ఇప్పుడు అడ్రస్ మారింది. ఏం చేయాలి?
జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాక చిరునామా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఫామ్-8 వినియోగించాలి. క్లెయిమ్‌లు, అభ్యంతరాల కాలంలో దీన్ని పరిశీలిస్తారు. అడ్రస్ మార్పు తుది జాబితాలో కనిపిస్తుంది.
బీఎల్వో తన ఇష్టానుసారం నా పేరును తొలగించగలరా?
లేదు. బీఎల్వో కేవలం సమాచారం సేకరిస్తారు. తుది నిర్ణయం ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత అధికారి తీసుకొంటారు.
మా కుటుంబంలో నాకు ఎన్యుమరేషన్ పత్రం ఇచ్చారు. మిగతా కుటుంబసభ్యుల పత్రాలను వేరే బీఎల్వో వచ్చి ఇస్తారు అంటున్నారు. ఎందుకు?
మీ ఓటు హక్కు బూత్ ఒకదగ్గర, మీ కుటుంబ సభ్యుల బూత్ మరోదగ్గర ఉండొచ్చు.
నా దగ్గర ఆధార్, పాన్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఉన్నది. కానీ, ఓటరు జాబితాలో పేరు లేదు. నాకు ఓటు హక్కు ఉన్నట్టా? లేనట్టా?
లేనట్టే. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి.
విదేశాల్లో లేదా ఇతర రాష్ర్టాల్లో ఉద్యోగం చేస్తున్నవారి పరిస్థితి ఏంటి?
కుటుంబంలోని ఎవరైనా ఓటరు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఆ వ్యక్తి ఎన్యుమరేషన్ పత్రాన్ని ఆ కుటుంబ పెద్దకు అందిస్తారు. ఓటరు తరఫున ఆ ఇంటి పెద్ద ఎన్యుమరేషన్ ఫామ్ న్ని నింపి సంతకం చేసి బీఎల్వోకు అందించాలి. ఒకవేళ ఓటరు విదేశాల్లో ఉంటే.. ఆ వ్యక్తి వివరాలు ఆ కుటుంబం పెద్ద ఎన్యుమరేషన్ ఫామ్‌లో నింపి సంతకం చేయొచ్చు. లేకపోతే విదేశాల్లో లేదా ఇతర రాష్ర్టాల్లో ఉన్న ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఫామ్ నింపొచ్చు.
ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ పూరించడం కుదరట్లేదు.ఎందుకు?
ఓటర్ జాబితాలోని పేరు, ఆధార్ కార్డులోని పేరు సరిపోలిన(మ్యాచ్ అయిన) ఓటర్లకు మాత్రమే ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ పూరించే అవకాశం ఉన్నది. అలా లేనివారు బీఎల్వో సాయంతో ఫిజికల్‌గా పూరించాలి.
2002 ‘సర్’ ఓటర్ల జాబితాలో పేరు ఉన్నదో లేదో ఎలా తనిఖీ చేయాలి?
రాష్ట్ర ఎన్నికల శాఖ వెబ్సైట్ https:voters.eci.gov.in లేదా ఈసీఐ యాప్ ECINET ద్వారా ‘సెర్చ్ బై ఎలక్టార్స్ డిటెయిల్స్’ ఆప్షన్ ద్వారా 2002 జాబితాలో ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. 2002 ‘సర్’ జాబితా హార్డ్ కాపీ బీఎల్వోల వద్ద కూడా ఉంటుంది. వారిని అడిగి వివరాలు తెలుసుకోవచ్చు.
2002లో ఓటరు జాబితాలో పేరు లేకపోతే? ఏం చేయాలి?
వలస వెళ్లడం, అప్పట్లో ఓటు నమోదు చేసుకోకపోవడంవల్ల మీ 2002 రికార్డు అస్సలు దొరక్కపోతే.. అప్పుడు పౌరుడి ఓటును తొలగించరు. దానికి బదులుగా, వారి ప్రస్తుత నివాస ప్రాంతంలో స్థానికులేనని నిరూపించే ప్రత్యామ్నాయ పత్రాలను (ఆధార్ కార్డ్, కరెంట్ బిల్, పాస్‌పోర్ట్) పరిశీలించి, ప్రస్తుత ఓటును ‘జెన్యూన్’గా ఖరారు చేస్తారు. అదేవిధంగా.. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారి పేర్లు 2002పాత ఓటరు జాబితాలో ఉండవు. అలాంటి వారి విషయంలో వారి తండ్రి, తల్లికి చెందిన 2002 ఓటర్ ఐడీ రికార్డుతో పిల్లల ఓటును లింక్ చేస్తారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశా.
అయినప్పటికీ 2002 ‘సర్’ జాబితాలో నా పేరు లేదు. అప్పుడేం చేయాలి?
ఓటరు పేరు 2002 ‘సర్’ జాబితాలో లేకపోతే, ఆ సమయంలో వారు తమ పేరును నమోదు చేసుకోలేదని అర్థం. లేదా అప్పటికి, సదరు ఓటరుకు ఓటు హక్కు రాలేదని అర్థం చేసుకోవాలి. అలాంటివారు తమ తల్లిదండ్రులు లేదా నాయనమ్మ-అమ్మమ్మ-తాతయ్యల ఓటరు వివరాలను సేకరించి ఫామ్‌లో నింపాలి.
కొత్తగా పెండ్లయిన మహిళల పరిస్థితి ఏమిటి?
ఇతర ప్రాంతాల నుంచి అత్తారింటిలో అడుగుపెట్టిన కోడలు ఇంటిపేరు మారుతుంది. కానీ, ‘సర్’ ప్రక్రియలో కోడళ్ల వంశవృక్షాన్ని తెలుసుకోవాలని అధికారులు అనుకొంటున్నారు. 2002లో సర్ ప్రక్రియలో ఏ నియోజకవర్గంలో ఉన్నారో స్పష్టంగా నమోదు చేయాలి. పెండ్లయిన మహిళలు తమ తల్లిదండ్రుల ఓటరు జాబితా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
వేర్వేరు రాష్ర్టాల్లో ఓటు ఉండొచ్చా?
భారత ఎన్నికల చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒక నియోజకవర్గంలో, ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఏ వ్యక్తి అయినా ఒక ఎన్నికలో ఒకసారి మాత్రమే ఓటేయాలి. రెండు చోట్ల ఓటు వేయడం నేరంగా పరిగణిస్తారు. ఒకేసారి రెండు రాష్ర్టాల్లో ఓటరు జాబితాలో పేరు ఉండటం చట్టవిరుద్ధం.
రెండు రాష్ర్టాల్లో ఓటు ఉంటే ఏం చేయాలి?
ప్రస్తుతం నివసిస్తున్న రాష్ట్రంలో ఓటును కొనసాగించి.. మరో రాష్ట్రంలోని ఓటును రద్దు చేసేందుకు దరఖాస్తు చేయాలి. ఉదాహరణకు.. ఏపీలో నివాసం ఉండి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నవారు.. ఒకవేళ హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకోవాలంటే.. ముందుగా ఏపీలో ఫామ్-7 సాయంతో ఓటును రద్దు చేసుకోవాలి. అనంతరం హైదరాబాద్‌లో ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఫామ్-6 లేదా అవసరమైన దరఖాస్తు ప్రక్రియ ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. అదే ఇప్పటికే తెలంగాణలో ఓటు ఉండి చిరునామా మాత్రమే మారితే ఫామ్-8 ద్వారా అడ్రస్ మార్పు చేసుకోవాలి.
రెండు రాష్ర్టాల్లో ఓటు ఉంటే అధికారులు గుర్తిస్తారా?
సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తారు. ఆధార్ (స్వచ్ఛందంగా సమర్పించినట్లయితే), ఎపిక్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, కుటుంబ వివరాలు పరిశీలించి డూప్లికేట్ నమోదులను గుర్తిస్తారు. దీని కోసం ఏఐ సాంకేతికతతో కూడిన కేంద్రీకృత వ్యవస్థ సాయాన్ని తీసుకొంటారు. ఫామ్‌లన్నీ సేకరించిన తర్వాత ఈ ఏరివేత ప్రక్రియ మొదలవుతుందని అధికారులు అంటున్నారు.
డూప్లికేట్ ఓటును గుర్తిస్తే తొలగిస్తారా?
డూప్లికేట్ ఓటును గుర్తించినా వెంటనే తొలగించరు. ముందుగా సంబంధిత ఓటరుకు నోటీసు ఇచ్చి వివరణ కోరుతారు. అవసరమైతే బీఎల్వో ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తారు. అనంతరం చట్టపరమైన విధానాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటారు.
రెండు రాష్ర్టాల్లో ఓటు ఉంటే, ఏ రాష్ట్రంలోని ఓటు తొలగిస్తారు?
సాధారణంగా ఓటరు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఉన్న ఓటును కొనసాగిస్తారు. పాత చిరునామాలో ఉన్న ఓటును తొలగిస్తారు.
ఒకే రాష్ట్రంలో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు ఉంటే గుర్తిస్తారా?
రాష్ట్రంలో ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు ఉంటే ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.
‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఓటరు కార్డులో సవరణలు చేయవచ్చా?
చేయొచ్చు. సాధారణ ప్రక్రియ ద్వారా ఈసీ అనుమతిస్తుంది.
‘సర్’లో ప్రతి ఒక్కరూ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలా?
లేదు. ఇప్పటికే నమోదైన వారి వివరాల ధ్రువీకరణకు, అవసరమైతే చిన్న చిన్న మార్పులుచేర్పులకు ‘సర్’ను నిర్వహిస్తున్నారు.
ఆధార్ లేకపోతే ఓటు పోతుందా?
లేదు. కేవలం ఆధార్ లేకపోవడం వల్ల ఓటు హక్కు ఏమీపోదు.
నా ఓటర్ ఐడీ పోయింది. ఇప్పుడు ఎలా?
డూప్లికేట్ ఓటరు కార్డుకు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇల్లు మారితే ఓటు పోతుందా?
ఓటు పోదు. పాత చిరునామాలో ఓటు ఉంటే, కొత్తగా మారిన ఇంటి నుంచి కూడా వివరాలు సమర్పించవచ్చు. ఈ మేరకు బీఎల్వోను సంప్రదించాలి.
ఓటరు జాబితాలో నా పేరు తొలగించే ముందు నాకు సమాచారం ఇస్తారా?
జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అందులో పేర్లు లేనివారికి నోటీసులు ఇస్తారు. సరైన పత్రాలు సమర్పించకుంటే అప్పుడు తొలగించే అవకాశం ఉన్నది.
నోటీసు వస్తే ఏం చేయాలి?
నోటీసులో పేర్కొన్న తేదీలోగా అవసరమైన పత్రాలు సమర్పించాలి.
ముసాయిదా ప్రచురించిన తర్వాత ఎవరి పేరుపైనైనా అభ్యంతరం చెప్పొచ్చా?
చెప్పొచ్చు. అయితే, తప్పుడు ఆరోపణలు పనికిరావు. పేర్కొన్న అభ్యంతరం ఆధారాలతో ఉండాలి.
ముసాయిదా జాబితాలో నా పేరు ఉండి, తుది జాబితాలో లేకపోతే ఏం చేయాలి?
అలా జరుగదు. ఒకవేళ, జరిగితే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
మ్యాపింగ్ జరుగకపోతే ఓటర్ల జాబితాలో పేరు ఉండదా?
ఓటర్ల మ్యాపింగ్ (ఎన్యుమరేషన్ పత్రాల్లో వివరాలు) జరిగినా, జరుగకపోయినా ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు ఉంటాయి. కాబట్టి రద్దుకావు.
మరి, పత్రాలు ఎప్పుడు సమర్పించాలి?
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత, ఈఆర్వో నోటీసు దశలో ఓటు మ్యాప్ కాకపోతే, లేదా ఓటర్ నిర్ధారణలో ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు మాత్రమే ఈసీ అడిగిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
2002 జాబితా మ్యాపింగ్ కోసం బంధువుల క్యాటగిరీలో ఎవరి వివరాలు నింపాలి?
తండ్రి, తల్లి, తల్లి తరఫు తాత, అమ్మమ్మ, తండ్రి తరఫు తాత, నానమ్మ
2002నాటి జాబితాలో తన పేరు లేదా బంధువుల పేరు (సంతాన భావన) లేని వారి పరిస్థితి ఏంటి?
2002నాటి జాబితాలో తన పేరు లేదా బంధువుల పేరు లేని వారిని తరువాత దశలో పత్రాలు సమర్పించమని అడుగుతారు.
రుజువు కోసం ఏ వయసుల వారు.. ఏ పత్రాలు సమర్పించాలి?
1987 జూలై 1కి ముందు భారతదేశంలో జన్మించిన వారు పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని నిర్ధారించే ఏమైనా పత్రాలు చూపాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టినవారు వారితోపాటు తండ్రి లేదా తల్లికి చెందిన పుట్టిన తేదీ పత్రాలు అందించాలి. 2004 డిసెంబర్ 2 తరువాత పుట్టినవారు తమ పత్రాలతోపాటు తండ్రి, తల్లి పత్రాలు అందించాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు గుర్తింపు కార్డులు, భూ కేటాయింపు పత్రాలను ఎన్నికల సంఘం ఆమోదయోగ్య పత్రాలుగా పేర్కొన్నది.
‘సర్’ తుది జాబితాలో పేరు లేకపోతే ఎన్నికల్లో ఓటు వేయలేమా?
అక్టోబర్ 1న ప్రచురించే తుది జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేయగలం. అందుకే ‘సర్’ ప్రక్రియలో అశ్రద్ధ వద్దు.
బీఎల్వో వచ్చినప్పుడు ఇంట్లోని ఓటర్లంతా ఉండాలా?
బీఎల్వో ఇంటికి వచ్చిన సమయంలో ఇంట్లోని ఓటర్లంతా ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబంలో మేజర్ అయిన ఏ సభ్యుడికైనా ఎన్యుమరేషన్ ఫామ్‌లను బీఎల్వో అందజేస్తారు. ఆ సభ్యుడి ద్వారా కూడా నింపిన ఫామ్‌లను బీఎల్వోకు అందించవచ్చు.
‘సర్’ ఎన్యుమరేషన్ దశలో అవసరమైన పత్రాలు ఏమిటి?
ఎన్యుమరేషన్ దశలో ఓటర్లు ఎటువంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫిజికల్ దశలో ఆధార్ వివరాలు పేర్కొనడం కూడా ఐచ్ఛికమే.
నాకు ఓటర్ ఐడీ లేదు. ఇప్పుడు ఓటరు జాబితాలో పేరు చేర్చడానికి దరఖాస్తు చేసుకోవచ్చా?
18 ఏండ్లు నిండిన వారు బీఎల్వో ఇచ్చే ఫామ్-6తోపాటు ఓటు నమోదు కోసం డిక్లరేషన్ ఫామ్ పూరించాలి. ఈ ఫామ్‌లను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కొనసాగే క్లెయిమ్‌లు, అభ్యంతరాల సమయంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) పరిశీలిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే కొత్త ఓటరు వివరాలు తుది జాబితాలో కనిపిస్తాయి.
ఓటరు జాబితాలో పొరపాట్లు సరిదిద్దడానికి ఏ పత్రాలు కావాలి?
ఓటరు పేరులో అక్షర దోషం లేదా ఇంటి పేరు మార్పు ఉంటే.. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి మెమో వంటి వాటిని సమర్పించాలి. వయసు లేదా పుట్టిన తేదీల్లో తేడా ఉంటే.. జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ప్రభుత్వం జారీ చేసిన వయసు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. తల్లిదండ్రుల పేర్లు లేదా బంధుత్వాల్లో తేడాలుంటే.. కుటుంబ రేషన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల ఓటరు గుర్తింపు కార్డులు, పాఠశాల రికార్డులను సమర్పించాలి. ఒకే కుటుంబంలో వయసు తేడాలు అసంబద్ధంగా ఉన్నా, కొన్నిచోట్ల తండ్రి కంటే కొడుకు పెద్దవాడిగా, తాత కంటే మనవడు పెద్దవాడిగా లేదంటే… తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య చాలా తక్కువ వయసు తేడా నమోదైనట్టు ఉన్నా.. కుటుంబానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి వివరాలు సరి చేసుకోవచ్చు.

నియోజకవర్గం మారితే.. ఫామ్ నింపడం ఎలా?
2002లో అప్పటి ‘సర్’ జాబితా ప్రకారం ఒకరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఐటీ కారిడార్‌లో నివసిస్తూ ఇక్కడే ఓటు కలిగి ఉంటే, ఈసీ సాఫ్ట్వేర్ దాన్ని గుర్తిస్తుంది. ఓటరు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో ఫామ్‌ని నింపినప్పుడు, సాఫ్ట్వేర్ కేవలం ఆ నియోజకవర్గంలోనే వెతుకదు. 2002 నాటి రాష్ట్రవ్యాప్త డాటాబేస్‌లో వారి పేరు, తండ్రి/భర్త పేరును రన్ చేసి చూస్తుంది. ఉదాహరణకు 2002నాటి రికార్డుల్లో వరంగల్‌లో ఆ వ్యక్తి పేరు ఉన్నట్టు సాఫ్ట్వేర్ గుర్తిస్తే, అది వెంటనే పాత రికార్డును ఇక్కడి మీ కొత్త రికార్డుతో లింక్ చేస్తుంది. దీనివల్ల మీ పాత ఓటు రికార్డు ఇక్కడికి అనుసంధానమవుతుంది.
ఈఆర్వో నోటీసులు అందుకొన్న వారు ఏయే పత్రాలు సమర్పించాలి?
ఈఆర్వో నోటీసులు అందుకొన్నవారు క్రిందివాటిలో ఏదైనా ఒకటి సమర్పించాలి.