హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సినీనటుడు మంచు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధిపై దాడి కేసులో పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారమే మోహన్‌బాబుపై కేసు నమోదైనప్పటికీ న్యాయసలహాలు తీసుకున్న పోలీసులు గురువారం బీఎన్ఎస్ 109 హత్యాయత్నం సెక్షన్ జోడించారు. ఇప్పటికే మనోజ్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మేనేజర్ కిరణ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు అనారోగ్యంతో గచ్చిబౌలి కాంటినెంటల్ దవాఖానలో చికిత్స పొందిన మోహన్‌బాబు గురువారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం రెండో ఆడియో విడుదల చేశారు. మీడియా ప్రతినిధిపై దాడికి సంబంధించి అభిప్రాయాలు పంచుకున్నారు.
మీడియా ప్రతినిధిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు. నాలుగు రోజులుగా మీడియా మిత్రులు వ్యాన్స్ పెట్టుకుని మా ఇంటివద్దే ఉన్నారు. నా కుటుంబ సమస్యను నేను పరిష్కరించుకుంటానని మంగళవారం ఉదయమే వాళ్లకు చెప్పాను. రాత్రి వేళల్లో గేట్లు తీసుకుని, అనుమతి లేకుండా నా ఇంట్లోకి రావడం ఏంటి? వచ్చిన వాళ్లంతా మీడియా సోదరులా? చేతిలో మైక్ పట్టుకుని పగవాళ్లు ఎవరైనా వచ్చారా? అని నాకు డౌట్ ఉంది. మైక్ తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టారు. అది కంటి కింద తగిలింది. చీకట్లో ఘర్షణ జరిగింది. మీడియా ప్రతినిధికి దెబ్బ తగలడం బాధగా ఉంది. మీడియా మిత్రుడిని కొట్టడం తప్పే. కానీ ఏ పరిస్థితుల్లో కొట్టాననేది ఆలోచించండి
-మంచు మోహన్‌బాబు