కామారెడ్డి, మే 22 : రెండు కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్ముకోవాలని చూసిన లారీ డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దోపిడీని అడ్డుకొన్నారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఓ లారీ రూ.2 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్‌తో చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరింది. యజమాని లారీకి జీపీఎస్ ట్రాకింగ్‌ను అమర్చారు. లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు లారీలో ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్ముకోవాలనే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో గల 44వ జాతీయ రహదారిపై గల దాబా వద్దకు శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాగానే జీపీఎస్‌ను కట్ చేసి వాహనాన్ని హైజాక్ చేశారు.
జీపీఎస్ తొలగించిన విషయాన్ని గమనించిన ఎండీఆర్ఎల్ ట్రావెల్స్‌కు చెందిన జలాలుద్దీన్ 100 డయల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. వెంటనే భిక్కనూరు పోలీసులను అప్రమత్తం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పోలీసులను, చెక్‌పోస్టులను, టోల్ గేట్లను అప్రమత్తం చేశారు. కామారెడ్డి జిల్లా నుంచి తప్పించుకోగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద లారీని పట్టుకొని డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేశారు.