రవీంద్రభారతి, డిసెంబర్ 8: రాష్ట్రంలో ఇసుక లారీలతోపాటు వాటి యజమానులపై అధికారుల దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని తెలంగాణ మైన్స్ అండ్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వీ దామోదర్‌గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పందుల యాదగిరిగౌడ్ ఆదివారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అధిక లోడ్ పేరుతో ఆర్టీఏ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు ఇసుక లారీలకు అడ్డగోలుగా రూ.లక్షల్లో చలానాలు విధిస్తున్నారని, ఆ జరిమానా కట్టలేక ఎంతో మంది లారీ యజమానులు, డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని వాపోయారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి తదితర జిల్లాలో అధికారుల వేధింపులకు తాళలేక పలువురు లారీ యాజమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఇసుక లారీలపై దాడులు నిలిపివేయించాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో తెలంగాణ మైన్స్ అండ్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ వెన్నపూజ ఫరిశంరాజ్, సుర్వీ లింగస్వామిగౌడ్, నరహరి సత్తయ్య, టీ పవన్‌కళ్యాణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.