BRS Party | తాంసి, జులై 06 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని అట్నంగూడ గ్రామస్తులంతా ఏకమై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం గ్రామస్తులందరికీ బోథ్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానంతో డప్పులు డ్యాన్సులు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను నమ్మి మొత్తం గ్రామమే పార్టీలో చేరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. రానున్నది మన కేసీఆర్ ప్రభుత్వమే అని మంచి రోజులు వస్తాయని అన్నారు. అర్హులందరికీ కచ్చితంగా పోడు పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కూడా మనం అభివృద్ధి కొరకు పాట్లు పడుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. యువ నాయకులు జామిడి అశోక్ మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతీ సమస్యను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ని చూసి గ్రామమంతా వారి వెంట బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ నాయకులు కృష్ణ రత్న ప్రకాష్, మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, కార్యకర్తలు పాల్గొన్నారు.