హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఎస్సై (సివిల్) ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 16 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ పోలీస్ అకాడమీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని 121 ఎకరాల పోలీస్ అకాడమీలో 130 మంది నిపుణులు ఏడాదిపాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ).. ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల పేర్లను పోలీస్ అకాడమీకి పంపింది. సోమవారం రాత్రి వరకు 368 మంది అభ్యర్థులు రిపోర్టు చేసినట్టు సమాచారం. ఇంకా సమయం ఉన్నందున బుధ, గురువారాల్లో అందరూ పోలీస్ అకాడమీకి రిపోర్టు చేయనున్నారు. గత ఎస్సై నోటిఫికేషన్లో వివిధ కారణాల వల్ల శిక్షణకు నోచుకోని 19 మంది అభ్యర్థులకు ఈసారి అవకాశం కల్పించినట్టు తెలిసింది. వీరిలో ఏడుగురు ఎస్సై అభ్యర్థులున్నట్టు సమాచారం. ప్రస్తుత నోటిఫికేషన్లో ఎస్బీ వెరిఫికేషన్లో 10 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉండటంతో దానిపైన ఉన్నతాధికారులు సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. సుమారు 10 నుంచి 15 మంది అభ్యర్థులు ఎస్సై ఉద్యోగానికి తాము ‘అన్విల్లింగ్’గా ఉన్నామని మెయిల్ పంపారని సమాచారం.
ఇన్నాళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ.. పోలీస్ అకాడమీలో రిపోర్టు చేసిన అభ్యర్థులకు ఆదివారం నుంచి ఉదయం, సాయంత్రం వామప్ చేయిస్తున్నారు. వీటితోపాటు అకాడమీలో 20 రకాల ఈవెంట్లు, గేమ్స్ ఆడిస్తున్నారు. ప్రస్తుతం రిపోర్టు చేసిన వారందరితో కలిపి 16 స్కాడ్స్గా విభజించారని, ఒక్కో స్కాడ్లో 27 మంది చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. సివిల్ అభ్యర్థులకు 12 నెలలు, ఏఆర్ అభ్యర్థులకు 10 నెలలు, టీఎస్ఎస్పీ అభ్యర్థులకు 9 నెలలు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే అందరికీ ఒకేసారి పాసింగ్ఔట్ పరేడ్ వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. మహిళల అభ్యర్థినులకు ప్రత్యేకంగా హాస్టళ్లు, మెస్ వసతి ఏర్పాట్లు చేశారు. ఇండోర్ విభాగం శిక్షణను 23 మంది డీఎస్పీల నుంచి ఎస్పీ స్థాయి అధికారులు.. ఔట్ డోర్ శిక్షణను ఏడుగురు అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు.