హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): భారత్‌లో ఆకాశహర్మ్యాల (స్కైస్క్రాపర్ల) రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ (ఇండియా) సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కే రాజ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టూరిజం ప్లాజాలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అత్యధిక ఆకాశహర్మ్యాలున్న నగరాల జాబితాలో ముంబై అగ్రస్థానంలో, హైదరాబాద్ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నట్టు తెలిపారు.
ల్యాండ్ బ్యాంక్ పుష్కలంగా ఉన్న హైదరాబాద్‌లో మరో 100 వరకు ఆకాశహర్మ్యాలు రాబోతున్నాయని, త్వరలో ముంబైని అధిగమించి నంబర్‌వన్ కావడం ఖాయమని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జూలై 17,18న సివిల్ ఇంజినీర్ల జాతీయ సదస్సు (నాట్కాన్-23) నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి 14 మంది వక్తలు, 600 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని రాజ్‌కుమార్ తెలిపారు.