పల్లెలపై పట్టణాల పెత్తనం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ‘అర్బన్' మేఘాలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, అధికారం మధ్య సమతుల్యతను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) దారుణంగా దెబ్బతీయబోతున్నట్టు తెలుస్తున్నది.
- నియోజకవర్గాల పునర్విభజనతో జరిగేది ఇదే
- జనాభా ప్రాతిపదికన పెరుగనున్న అసెంబ్లీ సీట్లు
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 25 సీట్లు అధికం
- రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 7 సీట్లు పెరిగే అవకాశం
- మట్టి వాసన కలిగిన జిల్లాలకు డీలిమిటేషన్ శాపమే
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ‘అర్బన్’ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, అధికారం మధ్య సమతుల్యతను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) దారుణంగా దెబ్బతీయబోతున్నట్టు తెలుస్తున్నది. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పల్లె ప్రాంతాల అస్తిత్వాన్ని విస్మరిస్తున్నదనే ఆవేదన వ్యక్తమవుతున్నది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 179కి పెంచడమనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేదిగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఇది పల్లె ప్రజల గొంతు నొకేసే కుట్రేనని అర్థమవుతున్నది.
అసెంబ్లీ సీట్ల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతంపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతుందని ఇప్పటికే సుస్పష్టమైంది. రాబోయే రోజుల్లో 179 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అర్బన్ ప్రాంతాలకు చెందినవారే ఉంటే బడ్జెట్ కేటాయింపుల్లో పాలకులు ఆ ప్రాంతానికే పెద్దపీట వేస్తారు. అలా తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక జిల్లాలే రాష్ట్ర గమనాన్ని శాసించే స్థాయికి వస్తే పాలమూరు లాంటి ప్రాంతాల్లో మళ్లీ వలసలు అధికమవుతాయి. పల్లె ప్రజల కష్టాలు అరణ్య రోదనగానే మిగిలిపోతాయి. నగర, పట్టణ ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగితే ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, హైవేల కోసం వేల కోట్ల రూపాయలు కుమ్మరించే పాలకులు అటవీ ప్రాంతాల్లో రోడ్లు లేక ఇబ్బందులు పడే గిరిజనులను, తాగునీరు లేక అల్లాడే మారుమూల గ్రామాల ప్రజలను పట్టించుకుంటారా? అన్నది ప్రశ్నార్థకమే.
‘గ్రేటర్’ పరిధిలోనే 25% సీట్ల పెరుగుదల
డీలిమిటేషన్ను జనాభా ప్రాతిపదికన చేపట్టబోతున్నందున జనసాంద్రత ఎక్కువగా ఉండే నగర, పట్టణ ప్రాంత జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరుగుతాయి. దీంతో తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి పట్టణ జిల్లాలకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. 2011 నాటికి తెలంగాణ జనాభా 3.5 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య డీలిమిటేషన్తో 50% (60 సీట్లు) పెరిగి 179కి చేరుతుంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లులోని ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రతి 5.83 లక్షల జనాభాకూ ఒక సీటు పెరిగే అవకాశం ఉన్నది.
ఈ లెక్కన 52.96 లక్షల జనాభా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అదనంగా 9 సీట్లు పెరుగుతాయి. దీంతో ఇప్పటికే 14 అసెంబ్లీ సీట్లున్న ఆ జిల్లాలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 23కు చేరుకుంటుంది. ఇదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 14 అసెంబ్లీ సీట్లకు అదనంగా 7 స్థానాలు పెరుగుతాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 25% అసెంబ్లీ సీట్లు కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పెరుగబోతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో 7, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 6, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 5, గ్రామీణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్లో 4 చొప్పున సీట్లు పెరిగే అవకాశం ఉన్నది.
అభివృద్ధిలో అసమతుల్యత
అసెంబ్లీలో పట్టణ ప్రాంత ప్రతినిధుల సంఖ్య పెరిగితే బడ్జెట్ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పనలో పాలకులు ఆ ప్రాంతాలకే పెద్దపీట వేసే ప్రమాదం ఉన్నది. దీంతో హైదరాబాద్ చుట్టుపకల జిల్లాలే రాష్ట్ర గమనాన్ని శాసించే స్థాయికి చేరుకుంటాయి. తద్వారా పల్లె ప్రాంతాల గొంతుక బలహీనపడే అవకాశం ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయాలు గ్రామీణ ఓటర్ల చుట్టూ తిరిగాయి. కానీ, డీలిమిటేషన్ తర్వాత అర్బన్ డామినేషన్ పెరుగబోతున్నట్టు స్పష్టమవుతున్నది.
రాబోయే రోజుల్లో హైదరాబాద్ గల్లీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తే రాష్ట్ర రాజధానికి ఎన్నో మైళ్ల దూరాన అడవుల్లో బతికే ప్రజల బాధలు శాసనసభకు వినిపించడం కష్టమవుతుంది. నగరాలు పెరిగితే సంపద పెరుగుతుందేమో కానీ, గ్రామాలు తగ్గితే సంస్కృతే అంతరించిపోతుంది. డీలిమిటేషన్ పేరుతో పల్లె గొంతుకను బలహీనపరిస్తే ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభాతోపాటు భౌగోళిక విస్తీర్ణాన్ని, వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుని పల్లెలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

