హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కన్నబిడ్డలు ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు పరితపిస్తుంటారు. ఓ రాష్ర్టానికి డీజీపీ అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అలాంటి అరుదైన దృశ్యం.. ఇప్పుడు నెట్టింట ప్రశంసలు పొందుతున్నది. అసోం రాష్ట్ర డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్‌సింగ్ (జీపీ సింగ్) కూతురు ఐశ్వర్యాసింగ్ ఇటీవల ఐపీఎస్ శిక్షణ పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 11వ తేదీన పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తయిన తర్వాత ట్రైనీ ఐపీఎస్ హోదాలో ఐశ్వర్యాసింగ్ డీజీపీ హోదాలో ఉన్న తన తండ్రి జీపీసింగ్కు సెల్యూట్ చేశారు. ఈ అపురూప దృశ్యాన్ని వీడియో తీసిన ఎన్పీఎస్ సిబ్బంది జీపీసింగ్కు పంపడంతో ఆయన ‘ఇది మాటల్లో వర్ణించలేని సందర్భం.. ట్రైనీ ఐపీఎస్‌గా నా కూతురి నుంచి సెల్యూట్ స్వీకరించా’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటికే ఐదున్నర లక్షల మంది వీక్షించారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏడీజీ స్వాతిలక్రా ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘తండ్రీకూతుళ్లిదరికీ ఇవి మధుర క్షణాలు.. ఇద్దరికీ కంగ్రాట్స్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.