ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక ఓ నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువు ప్రశ్నార్థకంగా మారింది. వైద్య కళాశాలలో సీటు వచ్చినా ఫీజు చెల్లించే పరిస్థితి లేక తల్లడిల్లుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన రేణుక, సైదులు దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్నేండ్ల క్రితం భర్త సైదులు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి భార్య కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషిస్తున్నది. కూతురు అస్మిత పదోతరగతిలో 9.8 జీపీఏ సాధించింది.
ఖమ్మంలోని అంబేద్కర్ గురుకుల కళాశాలలో 2020లో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. వెయ్యికి 951 మార్కులు సాధించింది. ఖమ్మంలోని గురుకులంలో ఉచితంగా మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లింది. ఏడాదిపాటు శ్రమించి జూలైలో నీట్- 2022 రాసింది. లక్షా 98 వేల ర్యాంకు సాధించింది. రెండో విడుత కౌన్సెలింగ్‌లో అస్మిత కల నెరవేరింది. ఆమెకు హైదరాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది.
కళాశాలలో చేరేందుకు రూ.లక్ష ఫీజు చెల్లించాలని యాజమాన్యం సూచించడంతో నిరాశకు గురైంది.అన్ని ఖర్చులు కలిపి ఏడాదికి సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుంది. తల్లి, తమ్ముడు కూలి పనులకెళ్తూ కుటుంబాని పోషిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అస్మిత దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నది. దాతలు తమకు తోచిన సాయాన్ని 70758 70020 నంబర్‌కు గూగుల్/ఫోన్ పే చేయాలని వేడుకుంటున్నది.