హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రాలకు కేంద్రం ఫోర్టిఫైడ్ బియ్యం, గోధుమలు ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వాటిని వినియోగించడం లేదన్న తీరులో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడగడం, దానికనుగుణంగానే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెప్పడంపై ఆదివారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవి తో కలిసి మాట్లాడారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మాట్లాడారని మంత్రి సత్యవతి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో తెలంగాణలో ముతక బియ్యం ఇస్తున్నారు, కేంద్రం ఇస్తున్న గోధుమలు, ఫోర్టిఫైడ్ బియ్యాన్నిఇవ్వడం లేదని అడిగారు. ఈమధ్య పార్లమెంటులో ప్రశ్నలు, జవాబులు చూస్తుంటే కాంగ్రెస్, బిజెపిలు ముందే అవగాహనకు వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడుకున్నట్టు కనిపిస్తోందని ఆమె విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన దానికి ఫోర్టిఫైడ్ బియ్యం, గోధుమల విషయంలో అవసరమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని విచారిస్తాం అని కేంద్రమంత్రి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అంగన్ వాడీలను వర్కర్లు అనొద్దు అని, టీచరుగా పిలుస్తూ వారిని గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. కేంద్రం ఇస్తున్న గోధుమలు అంగన్ వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నది పూర్తిగా అవాస్తవం. తెలంగాణలో గోధుమలు ఎప్పుడు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చిన గోధుమలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం చక్కెర, నూనె, పాల పౌడర్, పప్పు ధాన్యాలను అదనంగా కలిపి తయారు చేసిన బాలమృతం మాత్రమే ఇస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ పథకాలను పొగిడిన నోటితో నేడు అబ్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా పార్లమెంటులో పచ్చి అబద్ధాలు చెబుతున్న మంత్రులు క్షమాపణ చెప్పి, వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి సత్యవతి సూచించారు.