చిక్కడపల్లి, జనవరి 7: ప్రముఖ చిత్రకారుడు జగదీశ్ మిట్టల్(100) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. దోమలగూడ గగన్‌మహల్‌లోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సెప్టెంబర్‌లోనే మిట్టల్ 100వ జన్మదిన వేడుకులు కు టుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయన ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జగదీశ్ మిట్టల్ 1925 సెప్టెంబర్ 16న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో జ న్మించారు. కళాభవన్, విశ్వభారతి, శాంతినికేతన్ నుంచి ఫైన్అర్ట్స్లో డిప్లొమా పూర్తి చేశా రు. చిత్రకారుడు, కళా చరిత్రకారుడిగా గుర్తిం పు పొందారు. 1953లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన ఎంతో మంది చిత్రకారులకు ప్రోత్సహించారు. దక్కనీ పెయిటింగ్‌తో పాటు పలు పుస్తకాలు రాశారు.
హిందీ మాసపత్రిక కల్పనకు ఆర్ట్ ఎడిటర్‌గా పనిచేశారు. భారత్‌లోని పలు మ్యూజియంలు, విశ్వవిద్యాలయాల్లో, న్యూ యార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఆప్ ఆర్ట్స్‌లో భారతీయ పెయిటింగ్‌లు, భారతీయ హస్తకళలు, జానపదపై ఉపన్యాసాలు ఇచ్చారు. భారతీయ కళపై జరిగిన చాలా సెమినార్లలో పాల్గొన్నారు. కళారంగంలో ఆయన సేవలకు 1990లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అగర్వాల్ సమాజ్ కళారత్న పురస్కారం, సనాతనధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం, యుధ్వీర్ అవార్డు, ఏపీ ప్రభుత్వం 2006లో జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో: ఎందరో కళాకారులకు మార్గదర్శకుడిగా ఉంటూ స్ఫూర్తి నింపిన జగదీశ్ మిట్టల్ ఇక లేరనే వార్తను కళాలోకం జీర్ణించుకలేకపోతున్నదని సినీదర్శకు డు బీ నర్సింగరావు తెలిపారు. ఆయన మర ణం తీరని లోటని చెప్పారు. జగదీశ్ మిట్టల్ సహచరిణి కమలా మిట్టల్‌తో కలిసి దేశీయ కళా సంపదను సేకరించడంలో అపూర్వ కృషిచేశారని, దశాబ్దం క్రితం ఆమె తుది శ్వాస విడిచారని గుర్తుచేసుకున్నారు. జగదీశ్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్‌లో 2 వేల కళా ఖండాలను భద్రపరిచారని తెలిపారు. ఇది భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల వారి అభిరుచి, కృషికి ప్రతీకగా నిలిచిందని, హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందని కొనియాడారు. జగదీశ్‌మిట్టల్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ సంతాపం తెలిపారు. భారతీయకళ, వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడంలో ఆయన అపారమైన కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని ఏలె లక్ష్మణ్ తెలిపారు. 1976లో హైదరాబాద్‌లో మిట్టల్ దంపతులు ప్రారంభించిన జగదీశ్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ ద్వారా వారు అందించిన వారసత్వం స్ఫూర్తిగా నిలుస్తున్నదని వెల్లడించారు.