హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): పత్రికా స్వేచ్ఛపై సీఎం రేవంత్‌రెడ్డి అణచివేత ధోరణి అనుసరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి రాకముందు పాత్రికేయ విలువల గురించి ప్రవచనాలు పలికి, సోషల్ మీడియాను ఆకాశానికెత్తిన ఆయనే ఇప్పుడు అందుకు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ పత్రికాస్వేచ్ఛను కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిప్పట్నుంచి ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ సర్కార్‌పై అడ్డగోలు ఆరోపణలు చేశారు. సొంతంగా పలు యూట్యూబ్ చానళ్లను ప్రోత్సహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర కుటుంబ సభ్యలపై వ్యక్తిగత దూషణలకు దిగారు. అనుకూల చానళ్లలో అడ్డగోలు రాతలు రాయించారు. అసత్యాలను ప్రచారం చేయించారు.
వాటిపై చర్యలకు పూనుకుంటే పీసీసీ అధ్యక్షుడి హోదాలో తీవ్రంగా ఖండించారు. నిరంకుశ ప్రభుత్వమంటూ గగ్గోలు పెట్టారు. జర్నలిస్టుల అరెస్టును ఖండించారు. మీడియా మీద దాడిగా అభివర్ణించారు. ప్రజాప్రభుత్వంలో ప్రశ్నించే స్వేచ్ఛను కల్పిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఊదరగొట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారంటీగా ప్రచారం చేశారు. గద్దెనెక్కిన తర్వాత అసలు స్వరూపాన్ని చూపుతున్నారు. ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకనాడు ఆకాశానికెత్తిన సోషల్‌మీడియా వారియర్లనే టెర్రరిస్టులని అభివర్ణించారు. బట్టలూడదీసి కొడుతామంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలన వైఫల్యాలను ఎండగడుతున్న సోషల్‌మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు, పాత్రికేయులపై కక్షసాధింపులకు పాల్పడుతూ అరెస్టులు చేస్తున్నారు. మహిళా జర్నలిస్టులను సైతం అక్రమంగా నిర్బంధించారు. తాజాగా మరోసారి పాత్రికేయులను అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్టు చేసి మీడియాపై ప్రభుత్వ వైఖరిని మరోసారి తేటతెల్లం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతామని రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి చాటిచెప్పింది.
మీడియా అకాడమీ స్పందించదేం!
సీనియర్ పాత్రికేయుల అరెస్టుపై రాష్ట్ర మీడియా అకాడమీ ఇప్పటివరకు స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్ట్ సంఘాల్లో ఇదే విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఓ మంత్రి, ఐఏఎస్ అధికారిపై ఇటీవల మీడియాలో కథనాలు ప్రచురితం కావడం, ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సైతం విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో పాటు మరో ఏడు డిజిటల్ మీడియా సంస్థలైన తెలుగు స్రైబ్, ఎంఆర్ మీడియా, ప్రైమ్9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టైమ్స్, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీన్యూస్ తెలుగు చానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ చానల్ తన తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణ కోరింది. అయినప్పటికీ ఎన్టీవీకి చెందిన ముగ్గరు సీనియర్ రిపోర్టర్లను పోలీసులు అర్ధరాత్రివేళ అక్రమంగా అరెస్టు చేశారు. పాత్రికేయుల అరెస్టులను మీడియా సమాజమంతా తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్పాటు, ఇతర పార్టీలు, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలన్నీ ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. మీడియాపై దాడిగా అభివర్ణించాయి. ఇంత జరుగుతున్నా ఈ అంశంపై రాష్ట్ర మీడియా అకాడమీ స్పందించలేదు. మీడియా వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, సమస్యలను పరిష్కరించాల్సిన అకాడమీ ప్రభుత్వ తీరుపై ఎక్కడా నోరుమెదపలేదు. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. మీడియా అకాడమీ చైర్మన్ ఉన్నారా? మౌనమెందుకు వహిస్తున్నారని జర్నలిస్టు సంఘాలు నిలదీస్తున్నాయి.
కాంగ్రెస్ 6 గ్యారెంటీలతోపాటుగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును 7వ గ్యారంటీగా ఇస్తుంది. పత్రికా స్వేచ్ఛను కల్పిస్తాం. జర్నలిస్టుల
సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.
– పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి (జనవరి 2023)
మీడియా ముసుగులో కొందరు అరాచకాలను పాల్పడుతున్నారు. చేతిలో గొట్టమున్న ప్రతోడు జర్నలిస్టే అని ఫీలైపోతున్నడు. ఏది పడితే అది.. ఎలా పడితే అలా రాస్తున్నారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉన్మాదుల్లా తయారవుతున్నారు. అలాంటి వారిని ఉపేక్షించబోం. బట్టలూడదీసి కొడుతాం.
– నిరుడు మార్చిలో అసెంబ్లీ వేదికగా సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి