Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో మళ్లీ నేతలు ఇచ్చే డబ్బుల కోసం ఆశగా ఎదురుచూసే పరిస్థితులు వచ్చాయి. స్టేషన్‌కు వచ్చినవాళ్లు ఎంతోకొంత చేతిలో పెట్టకపోతారా? ఈ నెలకు సరిపడా ఛాయ్‌లు, బిస్కెట్లు, పనోళ్లకు డబ్బులు, ఇతర అవసరాలు తీరకపోతాయా? అంటూ కొందరు పోలీసు అధికారులు వేయికండ్లతో ఎదురు చూసే దుస్థితి వచ్చింది. స్టేషన్లో ఉండే నిందితులకు తిండి కూడా పెట్టలేకపోతున్నారు. పందేండ్లలో ఎప్పుడూ లేనిది.. మళ్లీ పాత రోజుల్లో అడిగినట్టు.. ‘ఏంటన్నా ఏమీ ఇవ్వకుండానే వెళ్తున్నావ్’ అనే దారుణ పరిస్థితికి వచ్చారు. కారణం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పోలీసు స్టేషన్ల ఖర్చుల కోసం నిధులు విడుదల చేయకపోవటమే. అవును.. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం లేదు. దీంతో పోలీస్ స్టేషన్ ఖర్చుల కోసం పోలీసు అధికారులు మళ్లీ నేతలు ఇచ్చే దక్షిణలపైనే ఆధారపడుతున్నారు. కొందరు ఆ డబ్బులను సొంతానికి సైతం వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు పోలీస్ స్టేషన్ నిర్వహణకు ప్రభుత్వాలు ఎలాంటి డబ్బులు ఇచ్చేవి కావు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు సైతం ఎంతోకొంత వసూలు చేయాల్సి వచ్చేది. ఇది కాస్తా.. స్టేషన్ ఖర్చుల కోసం పట్టిపీడించే స్థాయికి వచ్చింది. అయితే, ఆ దుస్థితి నుంచి పోలీసు వ్యవస్థను బయటపడేసేందుకు కేసీఆర్ సర్కారు.. రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ప్రతి నెల మెయింటెనెన్స్ కింద డబ్బులు కేటాయించింది. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం నుంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎక్కడో సరిహద్దుల్లో ఉండే మండల పోలీస్‌స్టేషన్‌కు కూడా క్రమం తప్పకుండా డబ్బులు విడుదల చేసింది. దీంతో ఖర్చుల కోసం స్టేషన్‌కు వచ్చేవారిని పీడించడం తగ్గిపోయింది. జంట నగరాలలోని ఒక్కో పోలీస్ స్టేషన్‌కు నెలకు రూ.75 వేలు, జిల్లాకేంద్రాలలో ఒక్కో పోలీస్ స్టేషన్‌కు రూ.50 వేలు, మండల కేంద్రాలలోని ఒక్కో పోలీస్ స్టేషన్‌కు నెలకు రూ.25 వేలు మంజూరు చేశారు. ఈ పద్ధతి తెలంగాణలో మినహా మరే రాష్ట్రంలోనూ లేదు.
పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెండింగ్ నిధులు కొన్ని కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కొత్త పోలీస్ స్టేషన్లు, జిల్లా పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులు చూడ్డానికి ఇంద్రభవనాల్లా ఉన్నా.. పోలీసులు మళ్లీ కక్కుర్తికొద్దీ చేతులు చాస్తుండటంతో కొందరు నేతలు ‘ప్రతి నెల మేం ఇవ్వాలా?’ అని కొన్ని స్టేషన్లలో ఎదురు ప్రశ్నించే స్థితికి పరిస్థితి దిగజారిందని వాపోతున్నారు. ‘ఏ పోలీస్ స్టేషన్ చూసినా ఏమున్నది గర్వకారణం.. మళ్లీ డబ్బులు అడుక్కునే దుస్థితికి దిగజారినం’ అని కొందరు నిజాయితీపరులైన అధికారులు చెప్తున్నారు.