నిజామాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు సమీపంలో, రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సర్కార్ జాగపై అధికార పార్టీ కన్నువేసింది. రోడ్డు, భవనాల శాఖ ఆధ్వర్యంలోని భూమిలో కాంగ్రెస్ పార్టీ భవనం నిర్మించుకునేందుకు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. భూ బదలాయింపు కూడా జరిగింది. నిజానికి ఇదే స్థలంలో ఆర్టీసీ బస్‌స్టాండ్ నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి గతం లో అడుగులు పడ్డాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్‌స్టాండ్ ఇరుకుగా మారింది. దీంతో. బీఆర్ఎస్ హయాంలో నూతన బస్‌స్టాండ్ కోసం భూ సేకరణ కోసం ప్రయత్నాలు జరిగాయి. రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ కార్యాలయం నుంచి మొదలు పెడితే ఇరిగేషన్ శాఖ ఈఈ కార్యాలయం వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో నూతన ఆర్టీసీ బస్‌స్టాండ్‌ను నిర్మించాలని యోచించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా జరిగాయి. పలుమార్లు స్థల పరిశీలన సైతం చేశారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రభుత్వం మారడంతో నిజామాబాద్ ప్రజల సౌకర్యార్థం నిర్మించాలనుకున్న నూతన బస్‌స్టాండ్ ప్రాంగణానికి గ్రహణం పట్టుకున్నట్లు అయ్యింది.
కాంగ్రెస్ భవన్‌కు ఎకరం స్థలం
రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ క్యాంపు కార్యాలయానికి ఆనుకుని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉన్నది. ఆ పక్కనే ఇరిగేషన్ శాఖ భూమి అందుబాటులో ఉన్నది. సమీకృత కలెక్టరేట్ నిర్మాణంతో ఇక్కడ స్థల లభ్యత పెరిగింది. పలు కార్యాలయాలను తరలించడంతో ఖాళీగా ఏర్పడిన చోట ప్రజాప్రయోజనాల కోసం కేసీఆర్ పరిపాలనలో ఏర్పాట్లు చేశారు. కానిప్పుడు అదే ప్రాంతంలో ఎకరం స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించడం చర్చనీయాంశం అవుతున్నది. వాస్తవానికి డీసీసీ భవన్ ఇరుకుగా మారింది. కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్టీ కార్యాలయం కోసం ప్రజల అవసరాలను పణంగా పెట్టడం సరికాదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. నిజామాబాద్ నగర శివారులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నెలకొల్పి ప్రతిపాదిత స్థలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి భూమిని గతంలో ప్రైవేట్ వ్యక్తులు విరాళంగా ఇచ్చారు. అక్కడే డీసీసీ భవన్ కొనసాగుతున్నది. తాజాగా కేటాయించిన స్థలంలో భారీ కాంప్లెక్స్ నిర్మించి తద్వారా ఆదాయాన్ని కాంగ్రెస్ కార్యాలయ నిర్వహణకు వెచ్చించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ప్రత్యామ్నాయం ఎక్కడ?
ఆర్టీసీ బస్‌స్టాండ్ కాంప్లెక్స్ కోసం ప్రతిపాదించిన స్థలంలో జిల్లా కాంగ్రెస్ భవన్ నిర్మిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సర్కార్ నిర్ణయంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీకి ప్రత్యామ్నాయ స్థలం లేకుండా పోతున్నది. నిజామాబాద్ నగరంలోని శంభుని గుడి వెనుక కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ కార్యకలాపాల కోసం 75 గజాల విలువైన స్థలం ఉన్నది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. మడిగెల కిరాయిని కూడా కాంగ్రెస్ పార్టీకి చెల్లిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలన్నీ రైల్వే స్టేషన్ సమీపంలోని డీసీసీ ఆఫీసులోనే జరుగుతున్నాయి. నెహ్రూ చౌక్ సమీపంలోని 75 గజాల భూమి 2002 నుంచి 8-4-359/1 ఇంటి నంబర్‌తో కాంగ్రెస్ పార్టీ పేరిట ఉన్నది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ భూమి విషయంలో భారీ ఝలక్ తగిలింది. కొంతమంది అక్రమార్కులు ఏకంగా అధికార పార్టీ టౌన్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖ తీరుతో కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలైంది. తదనంతరం 24 గంటల్లోనే అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి యథావిధిగా పట్టణ శాఖ పేరిటనే ఆస్తిని కొనసాగిస్తున్నారు.
29న సీఎం టూర్?
కాంగ్రెస్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నట్టు తెలిసింది. ఈ నెల 29న పర్యటన ఖరారు కానున్నట్టు సమాచారం. సీఎం చేతుల మీదుగా ఆర్అండ్బీ భూమిలో డీసీసీ ఆఫీస్‌కు భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చారు. అధికారికంగా
ప్రకటన రావడమే మిగిలి ఉన్నది.