హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అర్థగణాంక శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఆ శాఖతోపాటు ప్రణాళిక అభివృద్ధి సొసైటీ కార్యాలయాలను ఆయన సందర్శించారు. ప్రతి విభాగాన్ని కలియదిరిగి, వివిధ విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికనూ తనిఖీ చేశారు. రాష్ట్రంలో పంటల సాగు, జంతుజాలాల గణాంక, సర్వే, వాతావరణ విష్లేషణల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు నూతన ఒరవడితో పని చేయాల్సిన అవశ్యకత ఉన్నదని చిన్నారెడ్డి సూచించారు. ఎండల తీవ్రతపై ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా అర్థ గణాంక శాఖ సంచాలకులు దయానంద్ పీపీటీ ద్వారా ఆ శాఖ వివరాలు తెలిపారు.